
AP Rains: ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతోకూడిన వర్షం.. ఇవాళ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్'లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు తీవ్రంగా పడుతున్నాయి.ఆదివారం ఉదయం నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, భారీ వర్షాలతో వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారాయి.
ఈ వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.
ఆ సమయంలో పంటలు, ముఖ్యంగా ధాన్యం, మరికొన్ని పంటలు తీవ్రంగా నష్టపోయాయి.
గాలివాన బీభత్సంతో పాటు, పిడుగులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఈ దృష్ట్యా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
వివరాలు
తీవ్రంగా నష్టపోయిన అరటి, బొప్పాయి, మామిడి రైతులు
ఏపీలో ఈ విపరీతమైన వాతావరణం కారణంగా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
వీరిలో పిడుగుల కారణంగా 7 మంది మరణించగా, చెట్టు కూలి ఒకరు మరణించారు.
పిడుగులు, బలమైన గాలులతో భయానక పరిస్థితులు ఏర్పడటంతో ప్రజలు అప్రమత్తంగా ఉంటున్నారు.
తిరుపతి జిల్లాలో ముగ్గురు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు.
ఏలూరు జిల్లాలో పిడుగుపాటుతో ఒకరు మరణించారు, మరోరు చెట్టుపై పడటం వలన మరణించారు.
చాలా మంది గాయపడినట్లు కూడా సమాచారం అందింది. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయింది, అలాగే అరటి, బొప్పాయి, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
వివరాలు
ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా తీరం మీదుగా ఉత్తర కోస్తా(ఏపీ)వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
ఈ ప్రభావం వల్ల కోస్తా ప్రాంతాల్లో సోమ,మంగళవారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
అల్లూరి సీతారామరాజు,తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ క్రమంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని సూచించింది.
మే 10 తరువాత అండమాన్ సమీపంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.