Andhra news: అంగన్‌వాడీలకు తీపి కబురు.. గ్రాట్యుటీ అమలుకు ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు త్వరలోనే కూటమి ప్రభుత్వం శుభవార్త అందించనుంది.
వారు ఎన్నేళ్లుగా ఎదురుచూస్తున్న గ్రాట్యుటీ అమలుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
గత నెల రోజులుగా దీనిపై సమగ్రంగా పరిశీలన నిర్వహించిన ప్రభుత్వం, చివరికి దీనిని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం, గ్రాట్యుటీ అమలును కేంద్ర ప్రభుత్వంపై నెట్టివేస్తూ కాలం గడిపేసింది.
అంగన్‌వాడీలు 50 రోజుల పాటు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా పట్టించుకోలేదు.
అయితే, గత ఎన్నికల సమయంలో గ్రాట్యుటీ అమలు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన 8 నెలలలోనే దీనికి ఆమోదం తెలిపింది.
వివరాలు
లక్ష మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు ప్రయోజనం
ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడంతో పాటు, సొంతంగా అమలు చేసేందుకు కూడా ఆసక్తి కనబర్చింది.
ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి ముగిసిన వెంటనే అధికారికంగా జీవో విడుదల చేయనుంది.
గ్రాట్యుటీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా అదనంగా రూ.10 కోట్ల భారం పడే అవకాశం ఉందని అధికారులు లెక్కగట్టారు.
ఈ నిర్ణయం వల్ల సుమారు లక్ష మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు ప్రయోజనం కలుగనుంది.
వివరాలు
ఏటా రూ.20 కోట్ల వ్యయం
రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల్లో దాదాపు లక్ష మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం పదవీవిరమణ సమయంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.లక్ష, ఆయాలకు రూ.40 వేలు మాత్రమే అందిస్తున్నారు.
ఏటా సుమారు 600 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, మరో 700 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పదవీవిరమణ పొందుతారని అంచనా.
వీరికి పదవీవిరమణ ప్రయోజనం కింద చెల్లించాల్సిన మొత్తం ప్రభుత్వం సంవత్సరానికి రూ.8 కోట్లు నుండి రూ.10 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది.
వివరాలు
గ్రాట్యుటీ అమలైతే..
అంగన్‌వాడీ కార్యకర్తలు ఎన్ని సంవత్సరాలు సేవలో ఉన్నారో, దానికి అనుగుణంగా సంవత్సరానికి 15 రోజుల వేతనం చొప్పున గ్రాట్యుటీ కింద లభిస్తుంది.
ప్రస్తుతం అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ.11,500 వేతనం లభిస్తోంది.
15 రోజుల వేతనం ప్రకారం రూ.5,750గ్రాట్యుటీ లభించనుంది.
అంగన్‌వాడీ ఉద్యోగానికి గరిష్ట ప్రవేశ వయసు 35ఏళ్లు.
పదవీవిరమణ వయసు 62ఏళ్లు.
27 ఏళ్ల సర్వీసు చేసిన కార్యకర్తకు రూ.1.55 లక్షలు గ్రాట్యుటీ లభిస్తుంది.
25 లేదా 30 ఏళ్ల వయసులో చేరినవారికి ఇంకా ఎక్కువ మొత్తంలో గ్రాట్యుటీ లభించనుంది.
కొందరికి రూ.2 లక్షల నుండి రూ.2.20 లక్షల వరకు గ్రాట్యుటీ లభించే అవకాశం ఉంది.
ఆయాలకు నెలకు రూ.7,000 వేతనం ఉంటే, వారికి సర్వీసు కాలాన్ని బట్టి గ్రాట్యుటీ అందనుంది.
వివరాలు
ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో మాత్రమే అమలు
దేశవ్యాప్తంగా కేవలం గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లోనే అంగన్‌వాడీలకు గ్రాట్యుటీ అమలవుతోంది.
గుజరాత్‌లో అంగన్‌వాడీల గ్రాట్యుటీ హక్కులను సుప్రీంకోర్టు గతంలో సమర్థించింది, ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వం దీనిని అమలు చేసింది.
తాజాగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ఆమోదం తెలిపింది. ఇటీవల జరిగిన ఎన్నికల ముందు, అంగన్‌వాడీల పదవీవిరమణ వయసును 62 ఏళ్లకు పెంచారు.
దీని కారణంగా 2026 జనవరి వరకు పదవీవిరమణలు ఉండవని అధికారులు అంచనా వేశారు. 2026 తర్వాత పదవీవిరమణ పొందే అంగన్‌వాడీలకు ఈ గ్రాట్యుటీ అమలు కానుంది.