
Waqf Bill:వక్ఫ్ బిల్లుపై మరో పిటిషన్.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఆప్ ఎమ్మెల్యే
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన చారిత్రాత్మక వక్ఫ్ సవరణ బిల్లు-2025 తాజాగా పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. రాష్ట్రపతి సంతకంతో ఈ బిల్లు చట్టంగా మారనుంది.
చర్చ సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పార్టీలు బిల్లుకు పూర్తి మద్దతు తెలిపాయి.
ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఎంఐఎం, టీఎంసీ వంటి పార్టీలు బిల్లుకు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఓటింగ్‌లో వ్యతిరేకంగా ఓటేశాయి.
ఎన్డీయేకు ఉన్న సంఖ్యా బలంతో బిల్లు సులభంగా ఆమోదించారు.
ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ మొహమ్మద్ జావెద్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ బిల్లును సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Details
ప్రభుత్వ జోక్యంతో ప్రాథమిక హక్కులు దెబ్బతినే అవకాశం
అమనతుల్లా ఖాన్ తన పిటిషన్‌లో పేర్కొనగా, ఈ సవరణలు ముస్లింల మతపరమైన, సాంస్కృతిక స్వయంప్రతిపత్తికి భంగం కలిగిస్తాయని చెప్పారు.
ప్రభుత్వ జోక్యం వల్ల మైనారిటీలకు ఉండే మతపరమైన, స్వచ్ఛంద సంస్థల నిర్వహణ హక్కులు దెబ్బతింటాయని అన్నారు.
వక్ఫ్ బిల్లు ద్వారా తీసుకువచ్చిన సవరణలు రాజ్యాంగబద్ధతకు భంగం కలిగిస్తాయని, సమానత్వ హక్కు, మత స్వేచ్ఛ, మైనారిటీల హక్కులు వంటి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ఆయన తన వాదనల్ని పిటిషన్‌లో ప్రస్తావించారు.
ఇంకా, ఈ బిల్లుతో ముస్లిం మహిళలకు ప్రయోజనాలు చేకూరుతాయనీ, వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత పెరుగుతుందనీ బీజేపీ వాదిస్తోంది.
అయితే బిల్లుపై వ్యతిరేక వాదనలు, రాజ్యాంగ సంబంధిత చర్చలు కొనసాగుతుండటంతో, దీనిపై సుప్రీంకోర్టు తీర్పు కీలకంగా మారనుంది.