Page Loader
Chandrababu: రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు వైసీపీ మెయిళ్లు.. సీఎంకు ఆధారాలు చూపిన మంత్రి పయ్యావుల
సీఎంకు ఆధారాలు చూపిన మంత్రి పయ్యావుల

Chandrababu: రాష్ట్ర ప్రభుత్వ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీసేలా వివిధ సంస్థలకు వైసీపీ మెయిళ్లు.. సీఎంకు ఆధారాలు చూపిన మంత్రి పయ్యావుల

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 09, 2025
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా విడుదల చేసిన బాండ్లలో పెట్టుబడులు పెట్టకూడదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సూచనలతో, ఉదయభాస్కర్ అనే వ్యక్తి ద్వారా సుమారు 200 జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు మెయిల్స్ పంపించినట్లు రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ తెలిపారు. అయినా ఆర్థిక సంస్థలు వాటిని పట్టించుకోకుండా, చంద్రబాబుపై నమ్మకంతో బాండ్లను కొనుగోలు చేశాయని వివరించారు. ఈ కుట్రలో భాగంగా రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నించిన ఉదయభాసర్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాల్సిందిగా, అలాగే ఈ చర్యలకు ప్రోత్సాహం ఇచ్చిన జగన్, బుగ్గనలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కోరినట్టు చెప్పారు.

వివరాలు 

జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీ బ్రాండ్ విలువ ధ్వంసం

మంగళవారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. "బాండ్లలో పెట్టుబడి పెట్టవద్దని మెయిల్స్ పంపించిన ఉదయభాసర్ ప్రస్తుతం జర్మనీలో ఉంటున్నారు. ఆయన ఫేస్‌బుక్‌ ప్రొఫైల్‌ జగన్‌ ఫొటోతో ఉండటమే వైకాపాతో సంబంధాలకు నిదర్శనం. తన ఐదేళ్ల పాలనలో ఏపీ బ్రాండ్ విలువను ధ్వంసం చేసిన జగన్‌ ఇప్పుడు మళ్లీ అదే పనిలో పడ్డారు" అని విమర్శించారు.

వివరాలు 

రుణం తీసుకోవడంలో 15 రోజులు జాప్యం

"ఉదయభాసర్ మెయిల్స్ పంపినా పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీయలేకపోయారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కోర్టు విచారణలో ఉందంటూ తర్వాత మళ్లీ కంపెనీలకు మెయిల్స్ పంపించారు. ప్రెస్‌మీట్లు పెట్టి,వారి సొంత పత్రికలో ఏడుపులు, హడావుడితో వార్తలు రాయించారు. అయినప్పటికీ అసంతృప్తితో వైసీపీ ఎంపీ,పార్లమెంటు ఆర్థిక కమిటీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ద్వారా ప్రధాని మోదీ,ఆర్బీఐ,సెబీ, ఇతర సంస్థలకు ఫిర్యాదులు చేశారు. సెబీ పూర్తిగా విచారణ జరిపి, ఏవైనా లోపాలున్నాయా అని పరిశీలించి, అన్నీ సరిగానే ఉన్నట్టు నిర్ధారించి అనుమతినిచ్చింది. కానీ ఈ ప్రక్రియలో 15 రోజుల ఆలస్యం జరిగింది. ఇది మొత్తం జగన్, బుగ్గనల రాజకీయ కక్ష తీర్చుకునే కుట్రగా భావించాలి" అని తీవ్రంగా విమర్శించారు.

వివరాలు 

బుగ్గన అప్పట్లో చేసిన చర్యల్ని మరిచిపోయారా?

వైకాపా ప్రభుత్వ హయాంలో 2024 మార్చి 15న ఏపీఎండీసీ ద్వారా రూ.7వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని గుర్తు చేశారు. "ఆ సమయంలో ఆర్థిక శాఖ మంత్రిగా బుగ్గనే ఉన్నారు.ఇప్పుడు ఇదే చర్యపై ప్రశ్నలు లేవనెత్తుతున్న బుగ్గన అప్పట్లో చేసిన చర్యల్ని మరిచిపోయారా? తప్పు అప్పుడు జరిగిందా? లేదంటే ఇప్పుడా?" అంటూ కేశవ్ బుగ్గనను నిలదీశారు.

వివరాలు 

రాష్ట్ర ఆదాయంలో 99% జీతాలు, పింఛన్లకే:

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో 99 శాతం మొత్తాన్ని జీతాలు, పెన్షన్ల కోసం ఖర్చు చేస్తున్నట్టు పేర్కొన్నారు. గత నాలుగు సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరంలో ఖర్చు ఆదాయాన్ని మించి 107 శాతం వరకు పెరిగిందని చెప్పారు. అంటే ఆదాయం సరిపోక అప్పు తెచ్చి తీరుస్తున్నామని వివరించారు. ఇది తెలంగాణలో కేవలం 45 శాతం మాత్రమేనని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలతో ఈ విషయంపై చర్చలు జరిగాయని వెల్లడించారు.