Chandrababu: మిర్చి రైతుల కోసం కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లోని మిర్చి రైతుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలో మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఆయన లేఖ రాశారు.
మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే మిర్చిని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ పరిధిలో మిర్చి పంటను తక్షణమే కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు నాయుడు తన లేఖలో పేర్కొన్నారు.
ఏపీ మిర్చి రైతుల కష్టాలను వివరించిన చంద్రబాబు,మార్కెట్‌లో ధరలు పడిపోతున్న పరిస్థితిని ఢిల్లీలో ఇటీవల జరిగిన సమావేశంలో చర్చించిన అంశాలను తన లేఖలో ప్రస్తావించారు.
వివరాలు
మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద పూర్తిగా ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించాలి
ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం కింద 50 శాతం కాకుండా పూర్తిగా ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించాలని కోరారు.
ఇక,ఈ ఏడాది రాష్ట్రంలో మిర్చి సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరిగిందని చంద్రబాబు నాయుడు తెలియజేశారు.
గత ఏడాది క్వింటాల్‌కు రూ. 20,000 పలికిన వెరైటీ మిర్చి ప్రస్తుతం రూ. 13,000కి తగ్గిపోయిందని, సాధారణ రకం మిర్చి ధర ఏకంగా రూ. 11,000కి పడిపోయిందని లేఖలో పేర్కొన్నారు.
ముఖ్యంగా, విదేశాలకు మిర్చి ఎగుమతులు తగ్గిపోవడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని చంద్రబాబు తెలిపారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, కేంద్ర ప్రభుత్వం వెంటనే మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా మిర్చి కొనుగోళ్లను ప్రారంభించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
వివరాలు
మిర్చి యార్డును సందర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి
ఇక, మిర్చి ధరల పతనంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వమే ముందుకొచ్చి వారిని ఆదుకోవాలని కోరుతున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు మిర్చి యార్డును సందర్శించి రైతులతో మాట్లాడారు.
అనంతరం, మిర్చి రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా, సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా గుంటూరు మార్కెట్ యార్డుకు వచ్చి రైతులతో సమావేశం కావాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు.
అలాగే, మిర్చి రైతులకు పూర్తి సహాయంగా నిలిచి, వారి పంటను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.