Chandrababu: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలోని తన పర్యటన రెండవ రోజు కొనసాగిస్తున్నారు. మొదటి రోజు బిజీగా గడిపిన చంద్రబాబు, ఈ రోజు కూడా వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశాలు జరుపుతున్నారు. ఈరోజు మొదటగా, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. రాజధాని అమరావతికి అన్ని జిల్లాల కనెక్టివిటీ, అమరావతి - హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, అమరావతి - రాయలసీమ జిల్లాల కనెక్టివిటీ వంటి కీలక అంశాలు చర్చించారు.
పోలవరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు: చంద్రబాబు
మొదటి రోజు పర్యటనలో, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆ తర్వాత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో ప్రత్యేక సమావేశం జరిపారు. ప్రధానితో సమావేశం ఫలప్రదమైందని చంద్రబాబు ట్విట్టర్‌లో పంచుకున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సవరించిన అంచనాలకు కేబినెట్ ఆమోదం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంశాలను వివరించినట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో సమావేశం తర్వాత కూడా చంద్రబాబు ఎక్స్‌లో మరో పోస్ట్ పెట్టారు.
రైల్వే శాఖ భాగస్వామ్యంతో ఏపీ ప్రభుత్వం పని చేయడానికి సిద్ధం
డిసెంబర్‌లో వైజాగ్ రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేయబడుతుందని, రైల్వే శాఖ ఏపీలో 73,743 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుందని తెలిపారు. హౌరా-చెన్నై నాలుగు లైన్ల ప్రాజెక్టులో భాగంగా 73 రైల్వే స్టేషన్లను ఆధునీకరించడంలో సహకరించనున్నారు. రైల్వే శాఖతో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యంగా పని చేయడానికి సిద్ధంగా ఉందని ట్వీట్ చేశారు. ఇక ఈ రోజు సాయంత్రం 4:30కు కేంద్ర వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో,5:45కు కేంద్ర పెట్రోలియం, సహజ వనరుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో, రాత్రి 8 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో, రాత్రి 11:15కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్నారు.