CM Chandrababu :నేడు పోలవరం పర్యటనకు చంద్రబాబు.. ప్రాజెక్టు పరిశీలన, సమీక్ష
ఆంధ్రప్రదేశ్‌కి రెండోసారి సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు తొలి సారి పోలవరం పర్యటనకు వెళ్తున్నారు. ఈ రోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించి వాటి ప్రస్తుత స్థితిగతులను జలవనరులశాఖ అధికారులతో సమీక్షించనున్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పూనుకున్నారు. ఈ ప్రాజెక్టును వీరిద్దరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మొదటి పర్యటనను పోలవరంతో ప్రారంభించనున్నారు.
పోలవరంలో అధికారులతో మంత్రి రామానాయుడు సమీక్ష
పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆదివారం పోలవరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాలకు వెళ్తారని, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణిని మంత్రి ఆదేశించారు. ఆయన పర్యటనకు పకడ్బందీ భద్రత కల్పించాలని ఎస్పీ మేరీ ప్రశాంతిని ఆదేశించారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఎం.సూర్యతేజ, నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్లపై జేసీ సమీక్ష
సోమవారం పోలవరం ప్రాజెక్టు డ్యాం సైట్‌లో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతంగా పూర్తి చేసేందుకు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్య వేణి సంబంధిత అధికారులను ఆదేశించారు. జేసీ లావణ్య వేణి మాట్లాడుతూ.. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏలూరు జిల్లాలో సీఎం చేసే తొలి పర్యటనను అధికారులు విజయవంతం చేయాలని సూచించారు.
పోలవరం డ్యాం ప్రాంతంలో పనుల పురోగతిపై పరిశీలన
ఈ రోజు ఉదయం పోలవరం డ్యాం వద్ద ఉన్న హెలిప్యాడ్‌కు ముఖ్యమంత్రి చేరుకుంటారు. ప్రజాప్రతినిధులు, తదితరులతో సమావేశమైన అనంతరం ప్రాజెక్టు పనులను వ్యూ పాయింట్ నుంచి పరిశీలిస్తారు. అనంతరం పోలవరం డ్యాం ప్రాంతంలో జరుగుతున్న పలు పనుల పురోగతిని పరిశీలించనున్నారు. స్పిల్‌వే, గైడ్ బండ్, గ్యాప్ ఒకటి, రెండు, మూడు, ఎగువ స్ట్రీమ్ కాఫర్‌డ్యామ్, దిగువ కాఫర్‌డ్యామ్, పవర్ హౌస్‌లను పరిశీలిస్తారు. ముఖ్యమంత్రి పరిశీలించిన పనులకు సంబంధించిన పూర్తి వివరాలు అందించేందుకు సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు.