Pawan Kalyan: కారుణ్య నియామకాలకు ఆమోదం.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. కారుణ్య నియామకాలకు సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాల జాబితాలో ఉన్న అభ్యర్థులను జిల్లా కలెక్టర్ల కామన్ పూల్‌లో ఖాళీల్లో నియమించాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ ఉద్యోగులు, స్కూళ్ల ఉపాధ్యాయులు మరణించినప్పుడు వారి కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అంశంపై డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి, కమిషనర్‌తో సమావేశాన్ని నిర్వహించారు. పంచాయతీరాజ్ సంస్థల పరిధిలో ఖాళీల కొరత కారణంగా కారుణ్య నియామకాలలో జాప్యం జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.
నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై స్పందించిన పవన్ కళ్యాణ్
కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో ఎదురుమొండి-గొల్లమంద రోడ్డు పునర్నిర్మాణంపై కూడా పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు ప్రాజెక్టులో భాగంగా రూ. 13.45 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇటీవల వచ్చిన భారీ వరదల కారణంగా 700 మీటర్ల మేర ఈ రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. మోదీ ప్రసంగాలలో 140 కోట్ల భారతీయుల ఆశలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. 297 పురాతన వస్తువులను తిరిగి పొందడంపై, శాంతి, సంస్కరణల పట్ల మోదీ ఇచ్చిన పిలుపు ప్రపంచ దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
సనాతన ధర్మాన్ని కించపరిస్తే తీవ్రమైన పరిణామాలు
తిరుమల లడ్డూ అపవిత్రం కావడం పట్ల పవన్ కళ్యాణ్ విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొన్నారు. సనాతన ధర్మాన్ని కించపరిచే వ్యాఖ్యలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తప్పులు జరిగితే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని, లేకపోతే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడితే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదురుకావచ్చని హెచ్చరించారు.