Page Loader
అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక‌లో రేపే పోలింగ్; ముఖ్యాంశాలు ఇవే
అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక‌లో రేపే పోలింగ్; ముఖ్యాంశాలు ఇవే

అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక‌లో రేపే పోలింగ్; ముఖ్యాంశాలు ఇవే

వ్రాసిన వారు Stalin
May 09, 2023
07:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు మరో కీలక ఘట్టానికి సిద్ధమవుతోంది. పోలింగ్ బుధువారం జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం ఏర్పాట్లను చేసింది. కర్ణాటకలో 38ఏళ్లుగా ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి అధికారంలోకి రాలేదు. అయితే ఈ సారి మోదీ చరిష్మాతో ఆ రికార్డును చెరిపేయాలని బీజేపీ భావిస్తోంది. సెంటిమెంట్ కలిసిస్తోందని, బీజేపీ వైఫల్యాలే తమ పార్టీని గెలిపిస్తాయని కాంగ్రెస్ గంపెడు ఆశపు పెట్టుకుంది. అలాగే జేడీఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో మూడు పార్టీల భవితవ్యం బుధవారం తేలనుంది. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉండగా, అధికారంలోకి రావాల్సిన పార్టీ 113 సీట్లు గెలవాల్సి ఉంటుంది.

కర్ణాటక

ప్రచారంలో దూసుకుపోయిన బీజేపీ

కర్ణాటకలో విజయం సాధించడం ద్వారా ఈ ఏడాది జరగనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్,ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ల్లో బీజేపీ, కాంగ్రెస్ లబ్ధి పొందాలని చూస్తున్నాయి. కలబురగి జిల్లాకు చెందిన కన్నడిగ ఖర్గే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా అధికారంలో ఉండటంతో ఈ ఎన్నికల్లో కనీసం 150 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 99 బహిరంగ సభలు, 33 రోడ్ షోలు నిర్వహించారు. అయితే ప్రచారం విషయంలో మాత్రం కాస్త బీజేపీనే ముందుందని చెప్పాలి. ఏకంగా 206 బహిరంగ సభలు, 90 రోడ్‌షోలు, రాష్ట్ర నాయకులు 231 బహిరంగ సభలు, 48 రోడ్‌షోలు నిర్వహించినట్లు పార్టీ తెలిపింది. ఈ ఎన్నికల్లో కూడా జేడీఎస్ కింగ్‌మేకర్‌గా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

కర్ణాటక

కీలక అసెంబ్లీ స్థానాలు ఇవే

షిగ్గావ్: ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై షిగ్గావ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వరుణ: వరుణ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, ఆయన కుటుంబానికి కంచుకోటగా మారింది. 2018లో అతని కుమారుడు యతీంద్ర ఇక్కడి నుంచి గెలిచారు. కనకపుర: ఈ నియోజకవర్గం కేపీసీసీ అధ్యక్షుడు డికె శివకుమార్ సొంతగడ్డ. 2008 నుంచి ఆయన ఇక్కడి నుంచి గెలుస్తున్నారు. ఈసారి శివకుమార్ రెవెన్యూ మంత్రి, బీజేపీ నేత ఆర్ అశోకతో తలపడనున్నారు. చన్నపట్న: ఈ పొలిటికల్ హాట్ సీటులో జేడీ(ఎస్) నేత హెచ్‌డీ కుమారస్వామి, బీజేపీ అభ్యర్థి సీపీ యోగేశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థి గంగాధర్ ఎస్ మధ్య పోరు సాగనుంది. షికారిపుర: ఇక్కడి నుంచి యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను బీజేపీ బరిలోకి దింపింది.

కర్ణాటక

రాష్ట్రంలో 58,282 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు

రాష్ట్రంలో 58,282 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు సగటు ఓటర్లు 883గా అంచనా వేశారు. మొత్తం 1,320పోలింగ్ స్టేషన్‌లను మహిళా అధికారులు నిర్వహిస్తారు. 5.24 కోట్ల మంది ఓటర్లలో 5.60లక్షల మంది వికలాంగులుగా గుర్తించారు. వృద్ధులు, వికలాంగుల కోసం ఈ సారి ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. వారికి ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. కర్ణాటక జనాభాలో లింగాయత్‌లు 17%, వొక్కలిగాలు 15%, ఓబీసీలు 35%, ఎస్సీ, ఎస్టీలు 18%, ముస్లింలు 12.92% బ్రాహ్మణులు 3% ఉన్నారు. కర్ణాటకలో లింగాయత్‌లు 100స్థానాల్లో ఆధిపత్యం చెలాయిస్తారు. అసెంబ్లీలో అధికార బీజేపీకి చెందిన 37 మందితో సహా మొత్తం 54 మంది లింగాయత్ ఎమ్మెల్యేలు ఉన్నారు.