Delhi CM Oath : 21న ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణస్వీకారం.. కేబినెట్ మంత్రులుగా ఐదుగురు కొత్త వాళ్ళు
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి మార్లెనా ఈ నెల 21న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు ఐదుగురు నేతలు కూడా మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. ఈ జాబితాలో గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్‌తో పాటు, కొత్తగా ముఖేష్ అహ్లావత్ కూడా కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ముఖేష్ అహ్లావత్ సుల్తాన్‌పురి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటికే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామాను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించి, కొత్త సీఎంగా అతిషి పేరును ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలను రాష్ట్రపతి ఆమోదించిన నేపథ్యంలో, ఈ నెల 21న ప్రమాణస్వీకారం జరుగుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.
కొత్త ఎమ్మెల్యేలు కూడా కేబినెట్‌లో చోటు దక్కించుకునే అవకాశం
కేజ్రీవాల్ రాజీనామాతో ప్రస్తుతం కేబినెట్ సైతం రద్దవుతుండటంతో, కొత్త మంత్రివర్గం ప్రమాణం చేయనుంది. గోపాల్ రాయ్, కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్ మళ్లీ మంత్రులుగా కొనసాగనుండగా, మరికొంత మంది కొత్త ఎమ్మెల్యేలు కూడా కేబినెట్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.