Page Loader
Banakacherla Project: 'బనకచర్ల'పై దిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో చంద్రబాబు, రేవంత్‌రెడ్డి సమావేశం 
'బనకచర్ల'పై దిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో చంద్రబాబు, రేవంత్‌రెడ్డి సమావేశం

Banakacherla Project: 'బనకచర్ల'పై దిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో చంద్రబాబు, రేవంత్‌రెడ్డి సమావేశం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 15, 2025
09:14 am

ఈ వార్తాకథనం ఏంటి

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అంశంపై ఈ నెల 16న (బుధవారం) కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డిలతో సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని జలశక్తి శాఖ ఇరు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలకు, ముఖ్య కార్యదర్శులకు తెలియజేసింది. ఢిల్లీలోని జలశక్తి శాఖ ప్రధాన కార్యాలయం శ్రమశక్తి భవన్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో చర్చించాల్సిన ఇతర అంశాలు ఉన్నట్లయితే వెంటనే వాటిని పంపించాలని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్రాలకు సూచించింది. తొలుత ఈ నెల 11న సమావేశం నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినా, ముఖ్యమంత్రుల సమయం అందుబాటులో లేకపోవడంతో భేటీని 16వ తేదీకి వాయిదా వేశారు.

వివరాలు 

 పదేళ్లలో కేవలం రెండు సమావేశాలే.. 

ఈ తేదీన సమావేశానికి హాజరయ్యేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు అంగీకరించినట్లు సమాచారం. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టులు,జలవివాదాలకు సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా గల ఎపెక్స్‌ కౌన్సిల్‌లో చర్చించాల్సి ఉంటుంది. గత పదేళ్లలో కేవలం రెండు సమావేశాలే నిర్వహించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గోదావరి వరద జలాలను వినియోగించుకునేందుకు బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కేంద్ర మంత్రిని కలుసుకొని తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. పర్యావరణ అనుమతులు, కేంద్ర జల సంఘం అనుమతులు ఇవ్వకూడదంటూ లేఖలు కూడా పంపించారు.

వివరాలు 

కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ ప్రణాళిక 

గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రితో జరగనున్న సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. కృష్ణా, గోదావరి నదుల నీటిలో తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. తెలంగాణకు న్యాయమైన నీటివాటా సాధన కోసం పాటు పడటమే కాక, కృష్ణా నదిపై తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని కేంద్రాన్ని కోరాలని రేవంత్‌ రెడ్డి నీటిపారుదలశాఖ మంత్రిని, అధికారులను ఆదేశించినట్లు ఆయన కార్యాలయం తెలిపింది.

వివరాలు 

తెలంగాణ నీటివాటా సాధనతో పాటు..

ఈ మేరకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌కు లేఖ రాశారు. బుధవారం జరగనున్న సమావేశంలో తెలంగాణ నీటివాటా సాధనతో పాటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, కొత్త ప్రాజెక్టులకు అనుమతులు సాధించేందుకు ప్రయత్నించాలని నిర్ణయించారు. గతంలో కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, గత పదేళ్లలో అధికారంలో ఉన్న కేసీఆర్‌ ప్రభుత్వం న్యాయమైన నీటివాటా సాధించడంలో విఫలమైందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది.

వివరాలు 

గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది 

తెలంగాణకు కేవలం 299 టీఎంసీల నీటివాటా మాత్రమే కల్పించి, ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు కేటాయించారని తెలంగాణ వాదిస్తోంది. శ్రీశైలం ఎగువన ఏపీ అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులకు మౌనంగా అంగీకరించిందని, కృష్ణా నదిలో నీటిని ఏపీ యథేచ్ఛగా మళ్లించుకునేలా చేసింది అని సీఎంఓ వివరణలో పేర్కొంది. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నదిపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నీటి కేటాయింపులు చేయకుండా అనేక ప్రాజెక్టులను అసంపూర్తిగా వదిలేశారని ఆరోపించింది. అదే విధంగా గోదావరి నదిపై తుమ్మిడిహెట్టి వద్ద చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత ఆపేసి, దానికి బదులుగా లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.