New Medical Colleges: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. కొత్త మెడికల్ కాలేజీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం శుభవార్త తెలిపింది. కడప జిల్లాలోని పులివెందుల, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలకు 50 ఎంబీబీఎస్ సీట్లకు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అనుమతులు లభించాయి. ఈ కొత్త కళాశాలలతో రాష్ట్రంలో మెడికల్ సీట్లు మరింత పెరుగుతాయి. ఇప్పటికే విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల లాంటి ప్రాంతాల్లో కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. జూన్ 2023లో NMC బృందాలు పులివెందుల, పాడేరు మెడికల్ కాలేజీలను పరిశీలించిన విషయం తెలిసిందే.
50 సీట్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్
వనరుల కొరత కారణంగా తొలి దశలో అనుమతులు రాలేదు. అయితే, రెండో విడతలో వర్చువల్ ఇన్‌స్పెక్షన్ అనంతరం NMC ఇన్‌స్పెక్టర్లు అక్కడ ఉన్న వసతులతో అండర్‌టేకింగ్ లేకుండానే కళాశాలలకు 50 సీట్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పులివెందుల, పాడేరు మెడికల్ కాలేజీలతో పాటు, ఆదోని, మార్కాపురం, మదనపల్లెలో ఉన్న కొత్త మెడికల్ కాలేజీలలో ప్రతి కాలేజీకి 150 సీట్లతో తరగతులు ప్రారంభించేందుకు గత ప్రభుత్వంలోనే కసరత్తులు మొదలయ్యాయి.
సెప్టెంబర్ 16వరకు గడువు పొడగింపు
వీటి అమలు వల్ల మరింత వైద్యవిద్య అందుబాటులోకి రానుంది. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) 480 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 9తో దరఖాస్తు గడువు ముగియగా, తాజాగా ఈ గడువును సెప్టెంబర్ 16వరకు పొడిగించారు.