BJP: లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా.. రాష్ట్రాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన బీజేపీ
లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు పలు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లు, కో-ఇన్‌ఛార్జులను నియమించింది. ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు నడ్డా నియామక ఉత్తర్వులను జారీ చేశారు. బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇంచార్జ్‌గా, పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేను బిహార్, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కేరళ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. బిహార్ కో-ఇన్‌ఛార్జ్ బాధ్యతలను దీపక్ ప్రకాష్‌కు అప్పగిచారు. త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ హర్యానా ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. సురేంద్ర సింగ్ నగర్ రాష్ట్ర కో-ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తారు. హిమాకల్ ప్రదేశ్ ఇన్‌ఛార్జ్‌గా శ్రీకాంత్ శర్మ, రాష్ట్ర కో-ఇన్‌చార్జ్‌గా సంజయ్ టాండన్ వ్యవహరిస్తారు.
కర్ణాటక ఇన్‌ఛార్జ్‌గా రాధామోహన్ దాస్ అగర్వాల్
జమ్ముకశ్మీర్‌కు తరుణ్ చుగ్, జార్ఖండ్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌లుగా లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ నియమితులయ్యారు. కర్ణాటక ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా రాధామోహన్ దాస్ అగర్వాల్, కర్ణాటక కో-ఇన్‌చార్జ్‌గా సుధాకర్ రెడ్డి నియామకం అయ్యారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా మంగళ్ పాండే, కో-ఇన్‌చార్జ్‌లుగా అమిత్ మాల్వియా, ఆశా లక్రా నియమితులయ్యారు. లక్షద్వీప్, తమిళనాడు ఎన్నికల ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అరవింద్ మీనన్‌కు అప్పగించారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా మహేంద్ర సింగ్ ఉంటారు. సతీష్ ఉపాధ్యాయ్ మధ్యప్రదేశ్ కో-ఇన్‌చార్జ్‌గా వ్యవహరించనున్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌తో పాటు పంజాబ్‌కు ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. నరీందర్ సింగ్ పంజాబ్ కో-ఇన్‌చార్జ్‌గా ఉంటారు.
ఒడిశా ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా విజయపాల్ సింగ్ తోమర్
అండమాన్, నికోబార్ దీవుల కేంద్రపాలిత ప్రాంత ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా సత్య కుమార్ వై, డామన్, డయ్యూ బాధ్యతలను పూర్ణేష్ మోదీకి అప్పగించారు. దుష్యంత్ పటేల్ డామన్, డయ్యూకు కో-ఇన్‌ఛార్జ్‌గా ఉంటారు. గోవాకు ఆశిష్ సూద్, లడఖ్‌కు తరుణ్ చుగ్‌ను పోల్ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. ఒడిశా ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా విజయపాల్ సింగ్ తోమర్, పుదుచ్చేరికి నిర్మల్ కుమార్ సురానా నియమితులయ్యారు. లతా ఉసెండిని ఒడిశా కో-ఇన్‌చార్జ్‌గా నియమించారు. దిలీప్ కుమార్ జైస్వాల్ సిక్కింకు, దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను ఉత్తరాఖండ్‌కు ఎన్నికల ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు.