Page Loader
Monsoon Session: మూడో రోజూ అదే తంతు.. ఎలాంటి చర్చా లేకుండానే రేపటికి వాయిదా
మూడో రోజూ అదే తంతు.. ఎలాంటి చర్చా లేకుండానే రేపటికి వాయిదా

Monsoon Session: మూడో రోజూ అదే తంతు.. ఎలాంటి చర్చా లేకుండానే రేపటికి వాయిదా

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2025
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం ఉగ్రదాడి, బిహార్‌లో ఓటర్ల జాబితా సవరణ అంశాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. సమావేశాలు ప్రారంభమైన తొలి మూడు రోజులు కూడా ఉభయసభల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బుధవారం రోజున కూడా ఇరు సభలు ప్రతిపక్షాల ఆందోళనలతో అల్లకల్లోలంగా మారాయి. ఎటువంటి చర్చ జరగకుండానే లోక్‌సభ,రాజ్యసభలను వాయిదా వేయాల్సి వచ్చింది. రెండు సభలు రేపు ఉదయం 11 గంటలకు మళ్లీ సమావేశమవుతాయని ప్రకటించారు. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు మొదలైన వెంటనే, బీహార్ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ (SIR) ప్రక్రియపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

వివరాలు 

 ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం 

ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు ఓటర్ల జాబితా సవరణ చేపట్టడం పూర్తిగా ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని వారు ధ్వజమెత్తారు. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వంతో కలిసి కుట్ర పన్నుతోందని వారు ఆరోపించారు. ఇలాంటివి గతంలో ఎన్నోసార్లు చూశామని, ఓటర్ల జాబితా సవరణల పేరుతో ఎన్నికల ముందు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఎన్నికల పర్వంలో ఇది ఒక ప్రమాదకరమైన నిబంధనగా మారిందని మండిపడ్డారు.

వివరాలు 

రేపు ఉదయం 11 గంటలకు రెండు సభలు

ఇది మాత్రమే కాకుండా, ఇటీవల జమ్మూకశ్మీర్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి అంశం, కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విషయాలపై కూడా చర్చ జరపాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇండియా కూటమి (I.N.D.I.A Alliance) సభ్యులు బలమైన నిరసన వ్యక్తం చేయడంతో సభా కార్యకలాపాలు పూర్తిగా స్థంభించిపోయాయి. ప్రతిపక్ష సభ్యులు తమ ఆందోళనలను కొనసాగించడంతో, లోక్‌సభ, రాజ్యసభలు రేపటి వరకు వాయిదా వేయాల్సిన పరిస్థితి స్పీకర్‌లకు ఏర్పడింది. రెండు సభలు రేపు ఉదయం 11 గంటలకు మళ్లీ సమావేశం కానున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రేపటికి వాయిదా పడిన రాజ్యసభ