
Central Cabinet Decisions: 14 పంటలకు MSP పెంపు.. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన అశ్విని వైష్ణవ్
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలను తీసుకుంది. 2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వరి సహా మొత్తం 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంపును ఆమోదించింది. దీనిలో భాగంగా, ఒక క్వింటాల్ వరికి మద్దతు ధరను రూ.69 పెంచి, మొత్తంగా రూ.2369కి చేర్చింది. ఈ నిర్ణయాల వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. గత 10 నుంచి 11ఏళ్లలో ఖరీఫ్ పంటల ఎంఎస్‌పీలో ఇదే అత్యధిక పెంపుగా ఆయన అభివర్ణించారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు అనుగుణంగా ఈ పెంపు చేపట్టినట్టు తెలిపారు. ఈ ఎంఎస్‌పీ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2.7లక్షల కోట్ల నిధులు కేటాయించింది. అంతేకాకుండా, రైతులకు వడ్డీ రాయితీగా రూ.15,642కోట్లు అందించనున్నట్టు వెల్లడించారు.
వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లో రహదారి అభివృద్ధికి కేంద్ర ఆమోదం
అన్నదాతల పెట్టుబడిపై కనీసం 50 శాతం లాభదాయక మార్జిన్ లభించేలా చర్యలు తీసుకున్నట్టు మంత్రి వివరించారు. ఇక మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ నుంచి నెల్లూరు వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.3,653 కోట్ల వ్యయంతో 108.134 కిలోమీటర్ల పొడవున ఈ రహదారి అభివృద్ధి చేయనున్నారు. బద్వేల్‌లో గోపవరం నుంచి నెల్లూరు జిల్లాలోని గురివిందపూడి వరకు నిర్మించనున్న ఈ రహదారి కారిడార్ ద్వారా, కృష్ణపట్నం పోర్టుకు ప్రయాణ దూరం సుమారు 33.9 కిలోమీటర్ల వరకు తగ్గనుంది. ఈ ప్రాజెక్టుతో భారీగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని కేంద్రం వెల్లడించింది. ఈ రహదారి కారిడార్ నిర్మాణం ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి తోడ్పడే అవకాశముందని భావిస్తున్నారు.
వివరాలు
ప్రతి పంటకు పెరిగిన మద్దతు ధర వివరాలు
ఖరీఫ్ సీజన్‌లో మొత్తం 14 పంటలకు ఎంఎస్‌పీ పెరిగింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి: వరి (సాధారణ & గ్రేడ్-ఏ): ₹69 పెంపు జొన్నలు: ₹328 పెంపు సజ్జలు: ₹150 పెంపు రాగులు: ₹596 పెంపు మొక్కజొన్న: ₹175 పెంపు కందిపప్పు: ₹450 పెంపు పెసరపప్పు: ₹86 పెంపు మినుములు: ₹400 పెంపు వేరుశెనగ: ₹480 పెంపు పొద్దుతిరుగుడు: ₹441 పెంపు సోయాబీన్: ₹436 పెంపు కుసుమలు: ₹579 పెంపు వలిశలు (గడ్డినువ్వులు): ₹820 పెంపు పత్తి: ₹589 పెంపు