
Amaravarti-Hyderabad: అమరావతి-హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ హైవేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇంకా పరిష్కారం కాని అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి వివిధ అంశాల పరిష్కారానికి సంబంధించి సంబంధిత కేంద్ర శాఖలకు హోంశాఖ నిర్దేశనలు జారీ చేసింది.
ఫిబ్రవరి 3న కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అధ్యక్షతన 15 శాఖల ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో రోడ్లు-ఉపరితల రవాణా,ఉక్కు,బొగ్గు గనులు,వ్యవసాయం,పెట్రోలియం, రైల్వే తదితర శాఖల అధికారులతో చర్చలు జరిగాయి.
ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, అలాగే పునర్విభజన చట్టంలో పేర్కొన్న పెండింగ్ అంశాలపై లోతుగా సమీక్షించారు.
ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను కేంద్ర హోంశాఖ ఇటీవలే రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు పంపించింది.
వివరాలు
విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్
ఈ సమీక్షలో అమరావతి-హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది.
డీపీఆర్ తయారీ ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా రోడ్లు-ఉపరితల రవాణాశాఖకు హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
అలాగే, తెలంగాణలోని ఉత్తర భాగం రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) కు సంబంధించిన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా సూచించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరిన మేరకు, రాష్ట్రంలో మరో రిఫైనరీ ఏర్పాటు అవకాశాలపై పరిశీలన చేయాలని హోంశాఖ పెట్రోలియం శాఖకు సూచించింది.
అలాగే, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ పనులను వేగంగా కొనసాగించి, రెండు సంవత్సరాలలో అక్కడి నుంచే కార్యకలాపాలు ప్రారంభం అయ్యేలా చర్యలు తీసుకోవాలని రైల్వే శాఖను ఆదేశించింది.
వివరాలు
వెనుకబడిన ప్రాంతాలకు నిధులు
ఇంతేకాకుండా, విశాఖ, అమరావతి, కర్నూలు, హైదరాబాద్ కారిడార్ల అభివృద్ధిపై రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనలను కేంద్రం పాజిటివ్‌గా పరిగణించాల్సిందిగా తెలిపింది.
అంతేగాక, గతంలో ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాలకు విడుదల కావలసిన నిధులు ఇంకా పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో వాటిని త్వరితగతిన విడుదల చేయాలని సూచించింది.
అదే సమయంలో, తెలంగాణకు సంబంధించి నిధుల అంశంపై నీతి ఆయోగ్‌తో చర్చించాల్సిందిగా అధికారులకు హోంశాఖ స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చింది.