RRR: ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం పనులకూ కేంద్రం గ్రీన్ సిగ్నల్?
ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం పనులను కూడా కేంద్ర ప్రభుత్వం చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ ద్వారా ఉత్తర భాగం పనులను కేంద్రం చేపట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే, దక్షిణ భాగం పనులను రాష్ట్రం చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలో కేంద్ర రహదారి రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై, ఉత్తర భాగం పనులకు సంబంధించి సాంకేతిక, ఆర్థిక అనుమతులు త్వరగా ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా దక్షిణ భాగం పనులను కూడా కేంద్రమే చేపట్టే ఆలోచన చర్చకు వస్తోంది.
రూ.14,000 కోట్లకు పైగా ఖర్చు అయ్యే అవకాశం
ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి ఇప్పటికే ఎన్‌హెచ్ నంబరును కేంద్రం ప్రకటించడంతో ఇప్పుడు రెండు భాగాలను కేంద్రమే పూర్తి చేసి ఇదే నంబరుతో పనులను కొనసాగించాలని కేంద్రమంత్రి సూచలిచ్చినట్లు సమాచారం. ఆర్‌ఆర్‌ఆర్ మొత్తం 351 కిలోమీటర్ల మేర భూసేకరణ పూర్తయిన తర్వాత పనులు వేగంగా ప్రారంభమవుతాయని నితిన్ గడ్కరీ తెలిపారు. దక్షిణ భాగం (190 కిలోమీటర్ల)పై డీపీఆర్ తయారీకి రాష్ట్రం ఇటీవల కన్సల్టెన్సీ సంస్థ కోసం టెండర్లు పిలిచింది. ఈ పనులకు రూ.14,000 కోట్లకు పైగా ఖర్చు అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు. రాష్ట్రానికి నిధుల సమీకరణలో కష్టాలు ఎదురవుతున్న నేపథ్యంలో కేంద్రమే ఈ పనులను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
90శాతం భూ సేకరణ పూర్తి
కాగా ఉత్తర భాగం పనుల కోసం 161.59 కిలోమీటర్ల భూసేకరణ 90 శాతానికి పైగా పూర్తి చేశారు. 94 హెక్టార్ల భూమి కోర్టు కేసుల్లో ఉన్నా మిగతా భూముల సేకరణకు సంబంధించిన వివరాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ పరిణామాలతో, సాంకేతిక అనుమతులు మంజూరైతే, ఎన్‌హెచ్‌ఏఐ టెండర్ల ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు.