
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌పై చర్చ కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు కేంద్రం నో..!
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) అంశంపై చర్చించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.
అయితే, ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని సమాచారం.
ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించే విషయంలో కేంద్రం ముందడుగు వేయడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
వాస్తవానికి ఈ అంశంపై కేంద్రం స్పందన మాత్రం ఈ ఏడాది జులైలో జరగనున్న వర్షాకాల సమావేశాల్లోనే ఇవ్వబోతుందని తెలుస్తోంది.
వివరాలు
పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక సమావేశాన్ని తక్షణమే ఏర్పాటు చేయడం అత్యవసరం: రాహుల్
పహల్గాం దాడి జరిగిన తరువాతి పరిణామాలు, ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, లోక్‌సభ విపక్షనేత రాహుల్ గాంధీ ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
''ఈ సంక్లిష్ట సమయంలో దేశ ఐక్యతను ప్రతిబింబించేలా, పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక సమావేశాన్ని తక్షణమే ఏర్పాటు చేయడం అత్యవసరం'' అని ఆయన అభిప్రాయపడ్డారు.
రాహుల్‌గాంధీతో పాటు మరికొంతమంది విపక్ష ఎంపీలు కూడా ఈ డిమాండ్‌ను బలంగా వినిపించారు.
వివరాలు
జులైలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
ఇక, విపక్షాల ఈ డిమాండ్‌పై అధికార బీజేపీ నేతలు స్పందిస్తూ, ప్రస్తుతం ఆపరేషన్ సిందూర్ తాత్కాలికంగా నిలిపివేసిన తరుణంలో ఇలాంటి చర్చలు అవసరం లేదని పేర్కొన్నారు.
రాజకీయ ప్రయోజనాల కోసం ఇప్పుడు అనవసర చర్చలు జరపడం సమంజసం కాదని విమర్శించారు.
ఆపరేషన్ పూర్తైన తర్వాత అవసరమైతే చర్చకు సిద్ధంగా ఉంటామని సూచించారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ప్రత్యేక సమావేశానికి ఆసక్తి చూపడం లేదన్న వార్తలు తాజాగా తెరపైకి వచ్చాయి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులైలో ప్రారంభమయ్యే అవకాశముంది.