
#NewsBytesExplainer: ఏడాది పాలన పూర్తిచేసుకున్న ఎన్డీయే ప్రభుత్వం.. ఇప్పటిదాకా ఏయే..ఏయే.. హామీలు నెరవేరాయి?
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 2024 జూన్ 4న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 164 సీట్లు గెలుచుకొని అఖండ విజయాన్ని నమోదు చేసింది. అనంతరం జూన్ 12న ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, చంద్రబాబు నాయుడు నాలుగవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. పవన్ కళ్యాణ్ తొలిసారి శాసనసభకు ఎన్నికై ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రివర్గంలో మొత్తం 25 మందిలో 21 మంది టీడీపీకి, 3 మంది జనసేనకు, ఒకరు బీజేపీకి చెందినవారు. ఇప్పుడు ఏడాది పూర్తైన నేపథ్యంలో, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయనే అనేది ఇప్పుడు చూద్దాం..
వివరాలు
డీఎస్సీపై తొలి నిర్ణయం:
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో (2019-2024) డీఎస్సీ నిర్వహించలేదు. టీడీపీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, చంద్రబాబు తొలి సంతకం చేసిన ఫైలు డీఎస్సీకి సంబంధించినదే. అయితే ఎస్సీ వర్గీకరణ సమస్యల కారణంగా కొంత జాప్యం ఏర్పడినప్పటికీ, జూన్ 6 నుండి 16,347 పోస్టుల భర్తీ కోసం పరీక్షలు ప్రారంభమయ్యాయి.
వివరాలు
ఇంకా ఏడాదిలో ఏం చేశారు?
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు:వైసీపీ ప్రభుత్వం తెచ్చిన భూ టైటిలింగ్ చట్టాన్ని చంద్రబాబు నెల వ్యవధిలోనే ఆ చట్టాన్ని రద్దు చేశారు. ఇసుక విధానంలో మార్పు: గత పాలనలో విమర్శలపాలైన ఇసుక విధానాన్నిరద్దుచేసి,ఉచిత ఇసుక పాలసీ అమలు చేశారు. వినియోగదారుల నుంచి స్థానిక సంస్థలు సీనరేజ్ వసూలు చేయాలనే విధానం అమల్లోకి వచ్చింది. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ:జగన్ హయాంలో మూసివేసిన రూ.5 భోజన క్యాంటీన్లను తిరిగి ప్రారంభించారు. పింఛన్ల పెంపు: వృద్ధులు,వితంతువులు,కళాకారుల పింఛన్లను రూ.3,000 నుండి రూ.4,000కి పెంచారు.వలంటీర్ల స్థానంలో సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ కొనసాగిస్తున్నారు. రహదారుల అభివృద్ధి:రూ.3,800కోట్లు విడుదల చేసి రహదారుల మరమ్మతులు చేపట్టారు.గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రూ.6,000కోట్లతో గ్రామీణ రహదారులకు మరమ్మతులు జరుగుతున్నాయని ప్రకటించారు.
వివరాలు
సూపర్ సిక్స్ సంగతి ఏంటి?
1. ఉచిత గ్యాస్ సిలిండర్లు (ప్రతి ఇంటికి 3): దీపం 2.0 ద్వారా 3 సిలిండర్ల హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఒక్కో సంవత్సరం ఒక్కొక్క సిలిండర్ మాత్రమే అందించారు. కొంతమంది మహిళలు తమకు ఎంపిక రాలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2. తల్లికి వందనం - విద్యార్థి తల్లికి రూ.15,000: 2024లో అమలు కాకపోయినా, 2025-26 బడ్జెట్‌లో ప్రతిపాదించారు. జూన్ 12 నుండి అమలులోకి తెచ్చారు. అయితే పూర్తిగా రూ.15వేలు కాకుండా రూ.13వేలు మాత్రమే నేరుగా మంజూరు చేసి, మిగిలిన రూ.2వేలు విద్యా అభివృద్ధి నిధిగా వాడతామని చెప్పారు. 3. రైతులకు రూ.20,000 పెట్టుబడి సాయం: 'అన్నదాత సుఖీభవ' పథకంగా ప్రకటించారు. రూ.6,300 కోట్లు కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు అమలు కాలేదు.
వివరాలు
సూపర్ సిక్స్ సంగతి ఏంటి?
4. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000: ఈ హామీపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఐటీ సంస్థలు రాబోతున్నాయంటున్నారు. 5. మహిళలకు నెలకు రూ.1,500 భృతి: ఇది కూడా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించలేదు. 6. ఉచిత బస్సు ప్రయాణం (మహిళలకు): త్వరలో అమలు చేస్తామని చెబుతున్నా, తేదీపై స్పష్టత లేదు. సూపర్ సిక్స్ హామీల్లో నగదు బదిలీతో ముడిపడిన పథకాలు ఐదు ఉన్నాయి. వీటి అమలుకు సంబంధించి సరైన కార్యాచరణ బడ్జెట్‌లలో చూపలేదని ప్రతిపక్షాలు విమర్శించాయి. అయితే చంద్రబాబు డబ్బుల్లేవని,అప్పు తీసుకొని అయినా అమలు చేస్తామంటున్నారు.
వివరాలు
పీ-4 కార్యక్రమం - పేదరిక నిర్మూలన దిశగా కొత్త మోడల్:
పీ-4 అంటే పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్‌నర్‌షిప్. 10% ధనికులు రాష్ట్రంలోని అత్యంత పేద 20% కుటుంబాలకు దత్తత తీసుకొని సహాయపడే విధంగా రూపొందించారు. దీన్ని గమనించేందుకు ప్రభుత్వమే ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తోంది. వచ్చే ఆగస్టు 15 కల్లా 15 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
వివరాలు
పోలవరం,రాజధాని నిర్మాణం ఎంత వరకు?
అమరావతి రాజధానికి ప్రధాని నరేంద్ర మోదీ మేలో శంకుస్థాపన చేశారు. రూ.60,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రూ.47,000 కోట్ల పనులకు టెండర్లు ఖరారు అయ్యాయి. అయితే కొత్తగా 40,000 ఎకరాల అవసరం ఉందన్న ప్రతిపాదనపై రైతులు ప్రశ్నలు లేవనెత్తారు. పోలవరం ప్రాజెక్టు: ప్రస్తుతం డయాఫ్రం వాల్ నిర్మాణం జరుగుతోంది. వైసీపీ హయాంలో కేవలం 3.89% పనులు మాత్రమే జరిగాయని మంత్రి రామానాయుడు ఆరోపించారు.ఎన్డీయే అధికారంలో ఏడాదిలో మొత్తం పురోగతి 81.70 శాతానికి చేరినట్టు తెలిపారు. 2027 జూన్ నాటికి పూర్తి అవుతుందని అంచనా. అయితే ప్రతిపక్ష వైసీపీ ఎంపీలు - అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి - ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు.