ChandraBabu: ఏపీ ప్రజల తరుఫున ధన్యవాదాలు మోడీ జీ... బడ్జెట్‌పై హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు
ఏన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనతాదళ్(యునైటెడ్) రెండు పార్టీలే కీలకంగా వ్యవహరిస్తోన్నాయి. టీడీపీ, జేడీయూ అధికారంలో ఉన్న ఏపీ, బీహార్ రాష్ట్రాలకు ఈ వార్షిక బడ్జెట్‌లో అధిక మొత్తంలో నిధులు కేటాయించారు. బీహార్ అభివృద్ధికి రూ.59 వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.15 వేల కోట్లు వరాలుగా ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు బడ్జెట్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఏపీ రాజధాని అవశ్యకతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం
ఈ రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ వినిపించినా, కేంద్ర ప్రభుత్వం మాత్రం బడ్జెట్ లో పెద్ద కానుకలే ఇచ్చిందని చెప్పొచ్చు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర రాజధాని ఆవశ్యకతను కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. కేంద్రం నుంచి వచ్చే ఈ సాయం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నాయుడు తెలిపారు.
కృతజ్ఞతలు తెలుపుతూ నారా లోకేష్ ట్వీట్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కూడా కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇవాళ ప్రకటించిన బడ్జెట్‌పై తాను సంతోషం వ్యక్తం చేస్తున్నానని, ఏపీ అభివృద్ధికి, సామాజిక లక్ష్యాలను సాధించడానికి ఈ నిధులు దోహదపడతాయని వెల్లడించారు. ఏపీ పునర్నిర్మాణం దిశగా కేంద్రం అందిస్తున్న ఈ సహకారం ఎంతగానో ఉపయోగపడనుందన్నారు.