Chandrababu: భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తం ఉండాలి.. అధికారులతో సీఎం టెలికాన్ఫరెన్స్
వదర ప్రభావిత ప్రాంతాల్లో 9వ రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో, ఉత్తరాంధ్ర,గోదావరి జిల్లాల్లో అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం,కాకినాడ,ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ,ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. మరోవైపు, బుడమేరు ప్రాంతంలో వరద నీటి ప్రభావం కొంత తగ్గినట్లు తెలిపారు.సాయంత్రం నాటికి అనేక ప్రాంతాలు నీటి నుండి బయట పడతాయని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వాహనాలు,వ్యక్తులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్లను ఉపయోగించాలని,అలాగే కాలువల గట్లు, వరద ప్రవాహాలను డ్రోన్ల ద్వారా ఎప్పటికప్పుడు అంచనా వేయాలని సూచించారు.
డ్రోన్ ద్వారా బ్రీచ్ పాయింట్స్..
విజయవాడలో విద్యుత్ పునరుద్ధరణ దాదాపుగా పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని, మెడికల్ క్యాంపులు కొనసాగించాలని సీఎం ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో టెలికమ్యూనికేషన్ సేవలను పునరుద్ధరించడానికి మిగిలిన 5 టవర్లలో కూడా సిగ్నల్స్ త్వరగా అందుబాటులోకి రావాలని సూచనలు చేశారు. భారీ వర్షాల కారణంగా ఎర్రకాల్వలో వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, డ్రోన్ ద్వారా బ్రీచ్ పాయింట్స్ కూడా గుర్తించాలన్నారు. అదే విధంగా, ఏలేరు రిజర్వాయర్‌లోకి వచ్చే ఇన్‌ఫ్లో,అవుట్‌ఫ్లో సమతుల్యంగా ఉండేలా చూడాలని, ముందస్తు చర్యల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించవచ్చని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. జిల్లా కలెక్టర్లు ప్రస్తుత పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు.