
CM Revanth Reddy:ఆపరేషన్ సింధూర్.. ఉన్నతాధికారులతో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ సమీక్ష
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా ఉగ్రవాదులపై భారత సైన్యం మెరుపుదాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో, ఆపరేషన్ సింధూర్ ప్రభావంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.
హైదరాబాద్ వ్యూహాత్మకంగా దేశ రక్షణ పరంగా అత్యంత కీలక నగరంగా ఉండటంతో, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో అధికార యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచే ప్రయత్నంగా ముఖ్యమంత్రి, ఈ రోజు ఉదయం 11 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఈ సమీక్ష సమావేశానికి ఆర్మీ, పోలీస్ శాఖ,డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాలు సహా ఇతర ముఖ్య విభాగాల ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
వివరాలు
ఢిల్లీలో ఉన్న మల్లు భట్టి విక్రమార్కతో ఫోన్‌లో రేవంత్
దేశవ్యాప్తంగా ఉగ్రవాద చొరబాట్లు,వాటికి భారత సైన్యం స్పందన దృష్ట్యా,రాష్ట్రంలో పరిస్థితులను సమీక్షించి,అన్ని విభాగాలు అప్రమత్తంగా ఉండాలని, పరస్పర సమన్వయంతో పనిచేయాలన్న దిశగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచనలు ఇవ్వనున్నారు.
ఇక ఇదే సందర్భంలో ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సీఎం ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం.
అత్యవసర పరిస్థితి నేపథ్యంలో తక్షణమే హైదరాబాద్‌కు చేరుకోవాలని ఆయనకు సూచించినట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ దేశ రక్షణలో కీలక కేంద్రంగా ఉన్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయానికి రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయి ఏర్పాట్లు అవసరమన్న భావనను రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది.
వివరాలు
మాక్ డ్రిల్‌ను పర్యవేక్షించనున్న రేవంత్
అదేవిధంగా, ఈ సాయంత్రం జరగనున్న మాక్ డ్రిల్‌ను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించనున్నారు.
ఏవైనా అకస్మాత్తుగా సంభవించే అనూహ్య పరిణామాలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా సిద్ధంగా ఉండేలా అవసరమైన అన్ని చర్యలూ సీఎం తీసుకుంటున్నారు.