Page Loader
Telangana: రానున్న 3 నెలలు కీలకం.. నీటిపారుదలశాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
రానున్న 3 నెలలు కీలకం.. నీటిపారుదలశాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

Telangana: రానున్న 3 నెలలు కీలకం.. నీటిపారుదలశాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2025
08:47 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలో వచ్చే మూడు నెలలు అత్యంత కీలకమని, సాగు, తాగునీరు, విద్యుత్ అవసరాలు రాష్ట్రవ్యాప్తంగా భారీగా పెరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, సాగు, తాగునీటి అవసరాలకు ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి కమాండ్ కంట్రోల్ కేంద్రంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల కింద సాగునీరు అవసరాన్ని అనుసరించి నిర్ణీత ప్రణాళిక ప్రకారం విడుదల చేయాలని సూచించారు. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వివరాలు 

జిల్లా కలెక్టర్లకు సూచనలు 

రాష్ట్రంలోని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా సాగు,తాగునీరు అందించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం స్పష్టం చేశారు. నాగార్జునసాగర్,శ్రీరామసాగర్ ప్రాజెక్టుల కింద సాగుతున్న పంటలకు తగిన విధంగా నీటి విడుదలపై ఆయా జిల్లాల కలెక్టర్లు,నీటిపారుదల శాఖ ఇంజినీర్లతో సమీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రాజెక్టుల నుంచి ఆయకట్టుకు సాగునీటి విడుదలను స్వయంగా పరిశీలించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ విషయంపై కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి,తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం ఆదేశించారు. శ్రీశైలం,నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి కృష్ణా నదీ జలాల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని సీఎం అధికారులను హెచ్చరించారు. కేటాయించిన వాటా కంటే అధికంగా నీరు తరలించకుండా నియంత్రించేందుకు టెలిమెట్రీ వ్యవస్థ అమలు కీలకమని స్పష్టం చేశారు.

వివరాలు 

టెలిమెట్రీ వ్యవస్థ అమలు 

టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుకు అయ్యే ఖర్చులో భాగంగా, ఏపీ ప్రభుత్వం వాటా చెల్లించేందుకు ఆసక్తి చూపటం లేదని అధికారులు సీఎంకు వివరించారు. అయినప్పటికీ, అవసరమైన నిధులను తెలంగాణ ప్రభుత్వం ముందుగా సమకూరుస్తుందని సీఎం స్పష్టం చేశారు. వెంటనే టెలిమెట్రీ అమలుకు కృష్ణా బోర్డుకు లేఖ రాయాలని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాను సీఎం ఆదేశించారు. కృష్ణా నదీ జలాల పంపిణీ, వినియోగాన్ని పర్యవేక్షించే బాధ్యత కేంద్ర జలసంఘంపైనే ఉందని గుర్తు చేశారు. నిర్ణీత వాటా కంటే ఎక్కువ నీటిని ఏపీ తరలించకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఏకపక్ష నీటి తరలింపుపై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.