LOADING...
Congress: వక్ఫ్ బిల్లును సుప్రీంకోర్టులో సవాలు చేయనున్న కాంగ్రెస్
వక్ఫ్ బిల్లును సుప్రీంకోర్టులో సవాలు చేయనున్న కాంగ్రెస్

Congress: వక్ఫ్ బిల్లును సుప్రీంకోర్టులో సవాలు చేయనున్న కాంగ్రెస్

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 04, 2025
12:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వక్ఫ్‌ (సవరణ) బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్‌ (Congress) పార్టీ దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ బిల్లును సుప్రీంకోర్టులో సవాల్‌ చేయనున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత జైరామ్ రమేష్ (Jairam Ramesh) తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్‌ వేదికగా ఓ పోస్టు ద్వారా ప్రకటించారు. "ఇండియా కూటమి త్వరలోనే వక్ఫ్‌ (సవరణ) బిల్లును సుప్రీంకోర్టులో (Supreme Court) సవాల్‌ చేయనుంది. భారత రాజ్యాంగంలోని మూల సూత్రాలు, నిబంధనలపై దాడి చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని మేం తీవ్రంగా ప్రతిఘటిస్తూనే ఉంటాం" అని ఆయన స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జైరామ్ రమేష్ చేసిన ట్వీట్ 

వివరాలు 

లోక్‌సభలో 14 గంటలకు పైగా చర్చ

ఈ సందర్భంగా, గతంలో సీఏఏ, ఆర్టీఐ, ఎన్నికల నియమాలను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన విషయాన్ని రమేశ్‌ గుర్తుచేశారు. ప్రస్తుతం అవి విచారణలో ఉన్నాయని పేర్కొన్నారు. బుధవారం వక్ఫ్‌ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో 14 గంటలకు పైగా తీవ్ర చర్చ జరిగింది. విపక్షాల ఆరోపణలు, అధికారపక్షం కౌంటర్లతో సభ హోరాహోరీగా కొనసాగింది. అనంతరం ఓటింగ్‌ ప్రక్రియ చేపట్టగా, బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు ఓడిపోయాయి.

వివరాలు 

రాష్ట్రపతి ఆమోదానికి పంపిన  వక్ఫ్ బిల్లు

గురువారం, ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా, అర్ధరాత్రి దాటే వరకు దీనిపై విస్తృత చర్చ జరిగింది. అనంతరం జరిగిన ఓటింగ్‌లో, 128 మంది అనుకూలంగా, 95 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ప్రతిపక్షాల ప్రతిపాదించిన సవరణలు తిరస్కరించబడ్డాయి. ప్రస్తుతం, ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. ఆమోదం పొందిన వెంటనే ఇది చట్టంగా మారనుంది. ఈ బిల్లును 'యూనిఫైడ్‌ వక్ఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంపవర్‌మెంట్‌, ఎఫిషియెన్సీ అండ్‌ డెవలప్‌మెంట్‌ బిల్లు' (ఉమీద్‌-యుఎంఈఈడీ)గా ప్రభుత్వం నామకరణం చేసింది.