Jharkhand: ఎన్నికలకు సిద్ధమైన జార్ఖండ్.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక అంశాలు ఇవే..
అసెంబ్లీ ఎన్నికలకు ఆదివాసీ రాష్ట్రం జార్ఖండ్ సిద్ధమైంది. రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో 43 స్థానాలకు మొదటి దశలో పోలింగ్ జరగనుంది. ఈ సీట్లలో 28 ఎస్టీ, 9 ఎస్సీ రిజర్వు స్థానాలు ఉన్నాయి. నవంబర్ 13న జరగనున్న తొలిదశ పోలింగ్ కోసం అధికార జేఎంఎం, బీజేపీ పార్టీలు ఉత్కంఠభరిత ప్రచారాన్ని నిర్వహించాయి. ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నుండి చొరబాట్లు, అవినీతి, ప్రజా హామీలు, కేంద్రం నిధులు విడుదల వంటి అంశాలు కీలకంగా మారాయి.
చొరబాట్లే కీలకం..
ఈ ఎన్నికల్లో బంగ్లాదేశ్, రోహింగ్యాల చొరబాట్ల అంశం బీజేపీ ప్రధానంగా ఎంచుకుంది. సంతాల్ పరగణాలు, కొల్హాన్ ప్రాంతాల్లో ఈ సమస్య భారీగా ఉందని, రాష్ట్రం ఇప్పుడు ఒక ధర్మసత్రంగా మారిపోతుందని బీజేపీ ఆరోపించింది. అవి ఓట్ల కోసం అక్రమ చొరబాటుదారులను ఆశ్రయిస్తున్నారని, కాంగ్రెస్, ఆర్జేడీలతో కూడిన జేఎంఎం ప్రభుత్వం దీనిని ప్రోత్సహించిందని విమర్శించింది. అయితే , జేఎంఎం, బీజేపీ విమర్శలను తిప్పికోట్టింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయడం లేదని ఆరోపించింది. జేఎంఎం నాయకులు, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించారు.
ప్రజాకర్షక పథకాలు..
ఈ ఎన్నికలలో రెండు పార్టీలు ప్రజాకర్షక పథకాలపై హామీలు ఇచ్చాయి. జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మహిళలకు నెలకు రూ.వెయ్యి ఇస్తామని ప్రకటించగా, బీజేపీ కూడా అర్హులైన మహిళలకు నెలకు రూ.2100 ఇస్తామని తన మేనిఫెస్టోలో పేర్కొంది. జేఎంఎం దీనికి కౌంటర్‌గా, మహిళలకు ఈ మొత్తాన్ని రూ.2500కు పెంచుతామని హామీ ఇచ్చింది. బీజేపీ కూడా ఎల్‌పీజీ సిలిండర్‌ను రూ.500కి అందించి, ఏడాదికి రెండు ఉచితంగా ఇచ్చే హామీ ఇచ్చింది. నిరుద్యోగులకు రెండు సంవత్సరాలు నెలకు రూ.2000 చొప్పున ఇవ్వాలని, ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించటం, రెండు లక్షల 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని హామీ ఇచ్చింది.
ప్రభుత్వంలో అవినీతి..
హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు కూడా ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా మారాయి. భూ ఒప్పందానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను అరెస్టు చేయడం రాజకీయ విమర్శలకు కారణమైంది. బీజేపీ జేఎంఎం ప్రభుత్వాన్ని అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించింది. చంపాయీ తిరుగుబాటు.. హేమంత్ సోరెన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా ఎంచుకుంటే, చంపాయీ నుంచి ఊహించని ప్రమాదం వచ్చేయొచ్చని రాజకీయ విశ్లేషకులు ముందుగా అంచనా వేశారు. అందుకు తగినట్లుగా, పార్టీని వీడిన అయన బీజేపీలో చేరిపోయాడు. తాజా ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారు. చంపాయీకి ఆదివాసీ ప్రాంతాలలో ఉన్న ప్రజాదరణ కారణంగా, ఆ వర్గం ఓట్లు చీలిపోవడంతో జేఎంఎ-కాంగ్రెస్ కూటమిపై ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు.