
Polavaram: పోలవరం నిర్మాణంలో వెనుకపడుతున్న డయాఫ్రం వాల్ పనులు ..
ఈ వార్తాకథనం ఏంటి
పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టినప్పటికీ, 2027 డిసెంబరు నాటికి పూర్తయ్యేలా పనులు కొనసాగాలని లక్ష్యంగా ఉన్నా,అవసరమైన వేగం ఇంకా అందుబాటులోకి రాలేదు. గత ఏడాది కాలంలో సాంకేతిక సమస్యలను అధిగమించారు. కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా నిధులు మంజూరు చేసి పంపింది. ఆ నిధులు కూడా పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ, ప్రస్తుత దశలో అనేక కీలక పనులు అవసరమైన వేగంతో కొనసాగటం లేదు. 2025 డిసెంబరు చివరకు డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యం సాధ్యపడే సూచనలు ప్రస్తుతానికి కనిపించడంలేదు.
వివరాలు
2026 మార్చిలో పూర్తి చేసే అవకాశం
2014-19 మధ్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం ప్రాజెక్టుపై సమీక్షలు నిర్వహించి,స్వయంగా కేంద్ర సంస్థలు,కాంట్రాక్టర్లు,అధికారులు,నిపుణులతో చర్చలు జరిపి పనులను వేగంగా ముందుకు నడిపించారు. ప్రస్తుత పరిస్థితుల్ని చూస్తే, మళ్లీ అలాంటి కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరం అనిపిస్తోంది. ఈ ఏడాది జనవరిలో డయాఫ్రం వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం 67,000 చదరపు మీటర్ల పని చేయాల్సి ఉండగా,ఇప్పటివరకు 29% మాత్రమే పూర్తయింది. జులై మొదటివారానికి 47,673 చదరపు మీటర్ల పని మిగిలి ఉంది.నెలకు సగటున 5,300 చదరపు మీటర్ల చొప్పున పనులు చేస్తే,ఇంకా 9 నెలలు పడుతుంది. దాంతో 2026 మార్చిలో పూర్తి చేసే అవకాశం మాత్రమే కనిపిస్తోంది.
వివరాలు
జూన్ నెలలోనే 4,000 చదరపు మీటర్ల మేర పని
గత ఆరు నెలల్లో గరిష్ఠంగా జూన్ నెలలోనే 4,000 చదరపు మీటర్ల మేర పని పూర్తయింది. ఇదే ఇప్పటిదాకా చేసిన అత్యధిక ప్రగతిగా కనిపిస్తోంది. మొత్తం మూడు కట్టర్లతో పనులు చేయాల్సి ఉన్నప్పటికీ, మూడో కట్టర్ మే నెలలో మాత్రమే వచ్చిందని అధికారులు తెలిపారు. అంతకు ముందు అనేక ప్రాజెక్టుల్లో ఉపయోగించిన యంత్రాన్ని పోలవరం వద్ద ఉపయోగిస్తున్నందున, పూర్తి సామర్థ్యంతో పని చేయడం లేదని క్షేత్రస్థాయి ఇంజినీర్లు చెబుతున్నారు. గోదావరి నదిలో వరద కాలం ప్రారంభమవుతోంది. జులై నుంచి సెప్టెంబరు మధ్య రోజుకు 157 చదరపు మీటర్ల పని లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ప్రణాళిక వేశారు.
వివరాలు
మే నెలలో మార్పులు సూచించిన విదేశీ నిపుణుల బృందం
గ్యాప్-1 ప్రధాన డ్యాం పనుల ప్రగతిపై స్పష్టత లేదు. ఏప్రిల్‌లో ఈ పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నా, అవసరమైన ఆకృతులు ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదు. 2024 ఏప్రిల్‌లో డిజైన్లు కేంద్ర జలసంఘానికి సమర్పించినప్పటికీ, మే నెలలో విదేశీ నిపుణుల బృందం కొన్ని మార్పులు సూచించింది. ఆ మార్పులు చేసిన తర్వాత మళ్లీ వాటిని జలసంఘానికి పంపారు. అనుమతులు రావాల్సి ఉంది. అనుమతుల తర్వాతే పనులు వేగంగా సాగుతాయి. ఇక ఇతర కీలక ఆకృతుల ఖరారు విషయంలో కూడా ఆలస్యాలు జరుగుతున్నాయి. పోలవరంలో డిజైన్ సంస్థ ప్రతినిధులు అందుబాటులో లేకపోవడం కూడా కారణమని సమాచారం. ముఖ్యమైన డిజైనర్ దుబాయ్‌లో ఉండటంతో, డ్రాయింగ్స్‌కు తుది రూపం ఇవ్వడంలో ఆలస్యం అవుతోందని ఇంజినీర్లు పేర్కొంటున్నారు.
వివరాలు
విదేశీ నిపుణుల బృందం సిపార్సులపైనా చర్యల్లేవు
పర్యవేక్షణ విషయంలోనూ లోపాలున్నాయి. ప్రతి అంశాన్ని సమగ్రంగా పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక ఇంజినీరింగ్ అధికారిని నియమించాలని విదేశీ నిపుణుల బృందం సిఫార్సు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్‌గా ఉన్న నరసింహమూర్తి ఇంజినీర్ ఇన్ చీఫ్ గానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన అమరావతిలో కూడా పర్యవేక్షణ చేపట్టాల్సి ఉండటంతో, పూర్తిగా పోలవరం పనులపై దృష్టి పెట్టలేకపోతున్నారని అధికారులు చెబుతున్నారు. పైగా, మే నెలలో విదేశీ నిపుణులు చేసిన సిఫార్సులపై కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్పందించకపోవడం గమనార్హం.