Page Loader
India-China: తూర్పు లద్దాఖ్ కీలక ప్రాంతాల నుంచి.. వెనక్కి వస్తున్న భారత, చైనా బలగాలు 
తూర్పు లద్దాఖ్ కీలక ప్రాంతాల నుంచి.. వెనక్కి వస్తున్న భారత, చైనా బలగాలు

India-China: తూర్పు లద్దాఖ్ కీలక ప్రాంతాల నుంచి.. వెనక్కి వస్తున్న భారత, చైనా బలగాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 25, 2024
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-చైనా మధ్య సరిహద్దు సమస్యలకు పరిష్కారం కుదిరేలా ఇటీవల రెండు దేశాలు కీలక ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. గత నాలుగేళ్లుగా వాస్తవాధీన రేఖ (LAC) వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో, తాజాగా సరిహద్దుల్లోని బలగాల ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభించారు. తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలోని డెమ్చోక్‌, డెస్పాంగ్‌ నుంచి ఇరు దేశాల బలగాలు వెనక్కి మళ్లుతున్నట్లు భారత రక్షణ శాఖ అధికారులు తెలియజేశారు. ఈ ఒప్పందం ప్రకారం, భారత బలగాలు తమ సైనిక సామగ్రి, పరికరాలను వెనక్కి తీసుకువెళ్తున్నాయి. ఇరు దేశాల బలగాలు టెంట్లు, తాత్కాలిక నిర్మాణాలను తొలగిస్తున్నాయి. చార్దింగ్‌ లా పాస్‌ సమీపంలో సరిహద్దులోని ప్రాంతాల్లో, భారత బలగాలు పశ్చిమ దిశగా, చైనా బలగాలు తూర్పు దిశగా వెనక్కి కదులుతున్నాయి.

వివరాలు 

సరిహద్దు వద్ద దాదాపు 10-12 తాత్కాలిక నిర్మాణాలు, 12 టెంట్లు 

ఈ ప్రాంతాల్లోని సరిహద్దు వద్ద దాదాపు 10-12 తాత్కాలిక నిర్మాణాలు, 12 టెంట్లు ఉన్నట్లు సమాచారం. బలగాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత 4-5 రోజుల్లో పెట్రోలింగ్‌ పునరుద్ధరించనున్నట్లు తెలుస్తోంది. గస్తీ పునరుద్ధరణ కోసం ఇరు దేశాల మధ్య ఓ అంగీకారం జరిగింది. 2020లో గల్వాన్‌ ఘర్షణలకు ముందు పరిస్థితిని తిరిగి కొనసాగించే ప్రయత్నం జరుగుతోంది. ఇరు దేశాల సైనికులు 2020లో చేసుకున్న పెట్రోలింగ్‌ పాయింట్లకు స్వేచ్ఛగా వెళ్లగలిగే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ ఒప్పందాన్ని ఇటీవల బ్రిక్స్‌ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు ధృవీకరించారు.

వివరాలు 

20 మంది భారత సైనికుల వీరమరణం

2020 జూన్‌ 15న గల్వాన్‌ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందగా, చైనా కూడా సైనికులను కోల్పోయినప్పటికీ, వారి సంఖ్యను అధికారికంగా ప్రకటించలేదు. తర్వాత ఐదుగురు చనిపోయినట్లు మాత్రమే అంగీకరించింది. ఈ ఘర్షణల తర్వాత ఇరు దేశాలు LAC వద్ద భారీగా బలగాలను మోహరించాయి, అప్పటి నుంచి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తతలను తొలగించేందుకు ఇరు దేశాలు అనేక దౌత్య, కమాండర్ స్థాయి చర్చలు జరిపాయి. ఈ చర్చల ఫలితంగా కొన్ని ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించినప్పటికీ, డెమ్చోక్‌, డెస్పాంగ్‌ ప్రాంతాల్లో మాత్రం బలగాలు ఇంకా కొనసాగుతున్నాయి.