Page Loader
Sheesh Mahal: 'శీష్ మహల్' నచ్చలేదా?.. దిల్లీ కొత్త సీఎం నివాసంపై కీలక నిర్ణయం! 
'శీష్ మహల్' నచ్చలేదా?.. దిల్లీ కొత్త సీఎం నివాసంపై కీలక నిర్ణయం!

Sheesh Mahal: 'శీష్ మహల్' నచ్చలేదా?.. దిల్లీ కొత్త సీఎం నివాసంపై కీలక నిర్ణయం! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 10, 2025
03:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్లీకి కొత్త ముఖ్యమంత్రి రానున్నారు. సీఎంను ఎంచుకునే ప్రక్రియను బీజేపీ ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఈ తరుణంలో ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, దిల్లీ కొత్త సీఎం 'శీష్ మహల్' లో నివాసం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో సివిల్ లైన్స్‌లోని 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్ బంగ్లాను అధికారిక నివాసంగా ఉపయోగించేవారు. బీజేపీ ఈ బంగ్లాను 'శీష్ మహల్' (అద్దాల మేడ)గా అభివర్ణిస్తూ, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కేజ్రీవాల్ దీనిని 7-స్టార్ రిసార్ట్‌గా మార్చుకున్నారని విమర్శించింది.

Details

బంగ్లా వివాదానికి దూరంగా ఉండాలని నిర్ణయం

నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించామని, కానీ తాను మాత్రం అద్దాల మేడ నిర్మించుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. ఆప్ ప్రభుత్వంపై వచ్చిన ఈ అవినీతి ఆరోపణలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని తీవ్రంగా దెబ్బతీశాయి. భాజపాకు ఘన విజయాన్ని అందించాయి. అందుకే విమర్శలకు తావు లేకుండా బీజేపీ కొత్త సీఎం ఈ బంగ్లాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇదిలాఉంటే న్యూదిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్‌పై పోటీ చేసిన మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌సింగ్ వర్మ తనయుడు పర్వేశ్ వర్మ విజయం సాధించారు. ఆయనే సీఎం పదవిని దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే సంకేతాలు వెలువడిన సంగతి తెలిసిందే.

Details

మోదీ అమెరికా పర్యటన ముగిసిన తర్వాత దిల్లీ సీఎం ప్రమాణస్వీకారం

ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. ప్రధాని మోదీ సోమవారం నుంచి ఫ్రాన్స్, అమెరికాల్లో పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో, ఆయన తిరిగి వచ్చిన తర్వాతే సీఎం ప్రమాణస్వీకార వేడుకను నిర్వహించాలని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. మహిళను సీఎంగా చేసే యోచనలో పార్టీ ఉంటే, రేఖా గుప్తా లేదా శిఖా రాయ్‌లలో ఒకరిని ఎంపిక చేసే అవకాశముందని తెలుస్తోంది. ఎమ్మెల్యేలను కాకుండా సిట్టింగ్ ఎంపీల్లో ఒకరిని సీఎంగా నియమించాలని భావిస్తే, తూర్పు దిల్లీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లేదా ఈశాన్య దిల్లీ ఎంపీ మనోజ్ తివారీకి అవకాశం దక్కవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.