Page Loader
#NewsBytesExplainer: మావోయిస్టులను అంతమొందించడంలో కీలక పాత్ర పోషించిన DRG దళం ప్రాముఖ్యత ఏమిటి?
మావోయిస్టులను అంతమొందించడంలో కీలక పాత్ర పోషించిన DRG దళం ప్రాముఖ్యత ఏమిటి?

#NewsBytesExplainer: మావోయిస్టులను అంతమొందించడంలో కీలక పాత్ర పోషించిన DRG దళం ప్రాముఖ్యత ఏమిటి?

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2025
05:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దశాబ్ధాలుగా మావోయిస్టులతో సాగుతున్న యుద్ధానికి కేంద్రబిందువుగా నిలిచింది. కొన్నేళ్లుగా ఈ పోరాటంలో మావోయిస్టులే ఆధిపత్యం ప్రదర్శించగా, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. భద్రతా బలగాలు క్రమంగా పైచేయి సాధిస్తున్నాయి.ఈ మార్పుకు ప్రధాన కారణం.. గెరిల్లా యుద్ధతంత్రం. అడవుల్లో నివసిస్తూ, అక్కడి పరిసరాలను సమగ్రంగా తెలిసిన మావోయిస్టులు ఈ తంత్రంలో నిపుణులుగా ఎదిగారు. కానీ, సమతల ప్రాంతాల్లో పనిచేసిన అనుభవంతో అడవుల్లోకి ప్రవేశించిన పోలీసులకు ఇది కొత్త పరిచయం. ఈ తక్కువ అనుభవంతో వారు ఎన్నోసార్లు పరాజయాన్ని ఎదుర్కొన్నారు. అయితే ఈ లోపాన్ని గుర్తించిన ఛత్తీస్‌గఢ్ భద్రతా వ్యవస్థ, దాన్ని అధిగమించేందుకు ప్రత్యేక వ్యూహంతో ముందుకొచ్చింది.

వివరాలు 

డీఆర్జీ దళాల ఏర్పాటుకు నేపథ్యం ఏమిటి? 

అందులో భాగంగా ఏర్పాటు చేయబడిన డీఆర్జీ (District Reserve Guards)దళాలు,మావోయిస్టులకు ఎదురయ్యే పోరాటంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ దళాలు ఇప్పుడు ముందుండి జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందుతున్నాయి. డీఆర్జీ అంటే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్. వీటి ఏర్పాటుకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీస్ విభాగమే శ్రీకారం చుట్టింది. ఇవి సాధారణ పోలీస్ బలగాలే అయినప్పటికీ,మావోయిస్టు వ్యతిరేక పోరాటానికి ప్రత్యేకంగా రూపొందించబడ్డ యూనిట్‌గా భావిస్తారు. గెరిల్లా యుద్ధతంత్రాన్ని పూర్తిగా అవలంబించే మావోయిస్టులను సమర్థంగా ఎదుర్కొనే లక్ష్యంతో ఈ దళాలను ఏర్పాటు చేశారు. సాంప్రదాయ పద్ధతుల్లో పని చేసే పోలీస్ బలగాలకు గెరిల్లా స్టైల్ లో పని చేయడం పెద్ద సవాలుగా మారింది. ఈ లోటును పూరించేందుకు డీఆర్జీ దళాలను ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి రంగంలోకి దించారు.

వివరాలు 

డీఆర్జీ దళాల ప్రాధాన్యత - స్థానికతే ప్రధాన బలం 

అడవుల్లో మావోయిస్టులతో సమాన స్థాయిలో పోరాడగల సామర్థ్యం ఉన్న ఈ దళాలు, భద్రతా వ్యవస్థలో ఒక సరికొత్త శక్తిగా నిలిచాయి. ప్రస్తుతం మావోయిస్టు వ్యతిరేక చర్యల్లో ఈ యూనిట్‌ కీలక పాత్ర పోషిస్తూ ముందంజలో సాగుతోంది. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్స్‌ (డీఆర్జీ) దళాల్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే గిరిజన యువతను చేరదీయడం సాధారణం. ఈ దళాల్లోని సభ్యులు తమ ప్రాంత అడవులు,గిరిజన సంస్కృతి,భాషపై విశేష అవగాహన కలిగి ఉంటారు. అడవుల్లో దాగి సంచరించే నైపుణ్యం,పుట్టల్లో తిరుగడం,చెట్లు ఎక్కడం వంటి నైపుణ్యాలు వారికి సహజంగా ఉంటాయి. వీరి ప్రాంతీయ పరిజ్ఞానం నిఘా సమాచార సేకరణలో ఎంతగానో ఉపయుక్తంగా మారుతుంది. ఇది మావోయిస్టులపై చేపట్టే ఆపరేషన్లలో విజయం సాధించడానికి కీలక పాత్ర పోషిస్తోంది.

వివరాలు 

యువతను నక్సలిజంలోకి వెళ్లకుండా నిరోధం 

"మా ఊరి ప్రజలను మావోయిస్టుల నుంచి రక్షించాలి" అన్న భావనను పోలీసు శాఖ గిరిజన యువతలో పెంపొందిస్తోంది. ఈ మానసికత వాళ్లను తుపాకీ పట్టి మావోయిస్టులకు ప్రతిఘటించే ధైర్యవంతులుగా తీర్చిదిద్దుతోంది. గిరిజన యువతను డీఆర్జీ దళాల్లో చేర్పించడంతో పాటు, దళాల్లో చేరలేని వారిని సమాచారం ఇచ్చే ఇన్‌ఫార్మర్లుగా వాడుకోవడం, అలాగే వారికీ ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా బస్తర్ ప్రాంత యువతను నక్సలిజంలోకి వెళ్లకుండా నిరోధిస్తున్నారు. దీంతో మావోయిస్టుల కొత్త సభ్యులను నియమించుకోవడం కష్టంగా మారుతోంది. అంతేకాదు, డీఆర్జీ దళాల్లో పని చేస్తున్న స్థానిక యువత, మావోయిస్టుల బలాబలాలను గుర్తించడం, వారి చుట్టూ ఉన్న మద్దతుదారులను గుర్తించడం వంటి కీలక విషయాల్లో గొప్ప విజయం సాధిస్తున్నారు.

వివరాలు 

సల్వా జుడుం మారు రూపం - డీఆర్జీ 

2005లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా 'సల్వా జుడుం' అనే ఉద్యమం ప్రారంభమైంది. 'సల్వా జుడుం' అనే పదం గొండి భాషలో "శాంతియాత్ర" అనే అర్థం కలిగి ఉంటుంది. ప్రభుత్వం దీనికి మద్దతు ఇచ్చింది.ఈ ఉద్యమంలో పాల్గొన్న గిరిజన యువతకు ఆయుధాలు ఇచ్చి, మావోయిస్టులపై పోరాటాల్లో భాగస్వాములుగా చేశారు. వారు భద్రతా దళాలకు మార్గనిర్దేశం చేయడం,మావోయిస్టుల గురించి సమాచారం ఇవ్వడం, కొన్ని సందర్భాల్లో ఎన్‌కౌంటర్లలో పాల్గొనడం వంటి కార్యాచరణలు చేపట్టారు. అయితే, కొద్ది కాలంలోనే ఈ ఉద్యమం వివాదాస్పదమైంది. మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరికి ఇది సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. సల్వా జుడుం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

వివరాలు 

సల్వా జుడుం మారు రూపం - డీఆర్జీ 

ఆ తర్వాతే ఈ ఉద్యమాన్నిమూసివేశారు. అయితే, ఇదే ఉద్యమం ప్రభుత్వ ఆధ్వర్యంలో, రాజ్యాంగ ప్రమాణాలకు లోబడి "డీఆర్జీ"గా తిరిగి పునరుద్ధరించబడింది. సల్వా జుడుం అనుభవాల నుంచి నేర్చుకున్న పోలీసు శాఖ, డీఆర్జీ దళాన్ని మరింత సమర్థవంతంగా అభివృద్ధి చేసింది. బస్తర్ ప్రాంత గిరిజన యువతను నియమించి, వారిని పోలీసు దళాల్లో ఒక శక్తివంతమైన భాగంగా తీర్చిదిద్దారు. ఈ డీఆర్జీ దళాలు ఇప్పుడు ఛత్తీస్‌గఢ్ పోలీస్‌ విభాగంలో అనుబంధంగా పనిచేస్తున్నాయి. వీరి కార్యకలాపాలను డీఐజీ, ఐజీ, జిల్లా స్థాయిలో ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు.

వివరాలు 

బస్తర్ శక్తికి చిహ్నంగా "దంతేశ్వరి లడకే" పేరిట మహిళా డీఆర్జీ ఏర్పాటు 

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో 2019లో తొలిసారి మహిళల డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ (డీఆర్జీ) యూనిట్లను పోలీసులు ప్రారంభించారు. ఈ ప్రత్యేక మహిళా బృందానికి "దంతేశ్వరి లడకే" (అంటే దంతేశ్వరి దేవిని అనుసరించిన యోధినులు) అనే పేరు పెట్టడం జరిగింది. బస్తర్ ప్రాంత ప్రజలు దంతేశ్వరి దేవిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తుంటారు. అందుకే మహిళా కమాండో దళానికి ఆ దేవి పేరునే పెట్టారు. ఇది ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పాటైన తొలి మహిళా కమాండో బృందం కావడం విశేషం.దీనిని దంతేవాడ జిల్లాలో స్థాపించారు. ఈ బృందంలో భాగంగా ఉన్న వారు చాలా మందిలో మావోయిస్టులుగా పనిచేసి అనంతరం లొంగిపోయిన మహిళలు,గతంలో సల్వాజుడుం ఉద్యమంలో పాల్గొన్నవారు,అలాగే స్థానిక గిరిజన యువతులు కూడా ఉన్నారు.

వివరాలు 

బస్తర్ శక్తికి చిహ్నంగా "దంతేశ్వరి లడకే" పేరిట మహిళా డీఆర్జీ ఏర్పాటు 

ఇవాళ్టి తరం మహిళా కమాండోలు కూడా పురుష కమాండోల సరసన నేరుగా ఎన్‌కౌంటర్లు, కుంబింగ్ ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. ఈ బృందం ప్రధాన బాధ్యత గ్రామాలలో సామాన్యుల మధ్య కలిసిపోయి,వారికి సహాయపడుతూ,వారి సమస్యలపై స్పందిస్తూ,పోలీసుల పట్ల ప్రజల్లో విశ్వాసం కలిగించడం. ఇలాంటి సామాజిక అనుసంధానంతోపాటు మావోయిస్టులపై గూఢచర్య కార్యకలాపాలు కూడా చేస్తారు. మావోయిస్టుల కదలికలు,శిబిరాలు,వారికి సహాయపడే కొరియర్ వ్యవస్థ వంటి అంశాలపై వారు అత్యంత రహస్యంగా సమాచారం సేకరిస్తారు. అంతేకాకుండా,మహిళా మావోయిస్టులను అరెస్ట్ చేయడంలో,వారిని తగిన విధంగా ఎదుర్కొనడంలో, లేదా మావోయిస్టులకు సహాయం చేస్తున్న మహిళలను పట్టుకునే సమయంలో ఈ మహిళా బృందం కీలక పాత్ర పోషిస్తోంది.

వివరాలు 

మావోయిస్టుల దాడుల్లో ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నవి డీఆర్జీ బలగాలే 

మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని బయటి ప్రపంచంలో విమర్శలు వచ్చేవిధంగా కాకుండా, ప్రజాస్వామ్య పరిరక్షణకై మహిళా బృందాన్ని ఏర్పాటు చేయాలని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు నిర్ణయించారు. మావోయిస్టులను ఎదుర్కొనే క్రమంలో డీస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ)అనేక విజయాలను సాధించినా, అదే సమయంలో ఈ దళాలు గణనీయమైన ప్రాణనష్టం కూడా ఎదుర్కొంటున్నాయి.ప్రతి కీలక ఆపరేషన్‌లోను, మావోయిస్టుల తీవ్ర దాడుల్లోను అత్యధికంగా బలయ్యే వారు డీఆర్జీ సభ్యులేనని తేలుతోంది. 2023, ఏప్రిల్ 26 - దంతేవాడ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో భారీ ఐఈడీ పేలుడు జరిగింది.ఈ ఘటనలో 10 మంది డీఆర్జీ సిబ్బంది,ఒక స్థానిక డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. బస్తర్ ప్రాంతంలో డీఆర్జీకి ఇది అతి పెద్ద ప్రాణనష్టం కలిగిన ఘటనగా నమోదైంది.

వివరాలు 

2025, జనవరి 6 - బీజాపూర్ దాడి 

మరణించిన డీఆర్జీ సిబ్బందిలో ఐదుగురు ముందు మావోయిస్టులుగా ఉండి, తర్వాత సర్కార్‌కు లొంగిపోయి డీఆర్జీలో చేరినవారుగా గుర్తించారు. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన సుమారు 70 కిలోల బరువు గల ఐఈడీ పేలుడు సంభవించింది.ఈ దాడిలో 8 మంది డీఆర్జీ సిబ్బందితో పాటు ఒక స్థానిక డ్రైవర్ మరణించారు. ఇది గత రెండు సంవత్సరాలలో భద్రతా బలగాలపై జరిగిన అతి భారీ దాడిగా అధికారులు ప్రకటించారు. 2025, మార్చి 20 - బీజాపూర్/కాంకర్ ఎన్‌కౌంటర్‌లు ఈ తేదీన బీజాపూర్ మరియు కాంకర్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 30 మందికిపైగా మావోయిస్టులు హతమయ్యారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక డీఆర్జీ జవాన్ కూడా ప్రాణాలు కోల్పోయాడు.

వివరాలు 

2025, మే 21 - నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్ 

మావోయిస్టు కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావును మట్టుబెట్టిన ప్రత్యేక ఎన్‌కౌంటర్‌లో ఒక డీఆర్జీ జవాన్ మరణించాడు. మావోయిస్టులపై విజయవంతమైన ఆపరేషన్లు జరిగినప్పటికీ, మొదటి బుల్లెట్ తాకే బాధ్యతను, ప్రాణ నష్టాన్ని ఎదుర్కొనేది ప్రధానంగా డీఆర్జీ దళాలే అన్నది స్పష్టమవుతోంది.

వివరాలు 

ఛత్తీస్‌గఢ్‌ డీఆర్జీ దళాలపై తీవ్రమైన ఆరోపణలు 

మావోయిస్టుల ప్రభావం గల ప్రాంతాల్లో వారి కార్యకలాపాలను అణిచివేయడానికి అనేక రాష్ట్రాలు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేశాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఉద్దేశంతో గ్రేహౌండ్స్‌ దళాలను ఏర్పాటు చేయగా, ఒడిశా, జార్ఖండ్‌ వంటి రాష్ట్రాల్లోనూ నక్సలిజాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక బలగాలు పనిచేస్తున్నాయి. మావోయిస్టులపై నిర్వహించిన విరోధ ఆపరేషన్లలో డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌ (డీఆర్జీ) బలగాలు ముఖ్యమైన విజయాలు సాధించినప్పటికీ, ఈ విజయాల వెనుక ప్రాణ నష్టాన్ని కూడా ఎదుర్కొన్న ఘట్టాలు ఉన్నాయి. అయితే, ఈ బలగాలపై కూడా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి, ఇది నాణానికి మరోవైపు అని చెప్పవచ్చు.

వివరాలు 

డీఆర్జీ దళాలపై వచ్చేస్తున్న ప్రధాన ఆరోపణలు 

కృత్రిమ ఎన్‌కౌంటర్లు: అడవులు, గిరిజన గ్రామాల్లో అమాయక ఆదివాసీలను మావోయిస్టులుగా చిత్రీకరించి ఎన్‌కౌంటర్లలో హతమారుస్తున్నారన్న ఆరోపణలు డీఆర్జీ దళాలపై వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాంతాల్లో జరుగుతున్న మావోయిస్టు వ్యతిరేక చర్యలు పారదర్శకత లోపించడంతో, నిజంగా మావోయిస్టులేనా లేదా అమాయకులా అన్న విషయంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమాయకులపై చిత్రహింసలు: మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న నెపంతో కొంతమంది స్థానికులను నిర్బంధించి, అమానుషంగా హింసించడం జరుగుతోందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తుల ధ్వంసం, దోపిడీలు: కొందరి ప్రకారం, డీఆర్జీ బలగాలు గ్రామాల్లోకి ప్రవేశించి మావోయిస్టుల కోసం శోధన చేస్తూ, గ్రామస్తులను హింసించడం, సహకరించని వారి ఆస్తులను ధ్వంసం చేయడం, వారి వద్దనున్న వస్తువులను లాక్కోవడం వంటి చర్యలు చేపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వివరాలు 

లొంగిపోయిన మావోయిస్టుల నియామకంపై వచ్చిన తీవ్ర విమర్శలు 

డీఆర్జీ (డీజీఎఫ్‌ఎస్) దళాల్లో గతంలో మావోయిస్టులుగా ఉన్నవారిని చేర్చడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరు గతంలో చేసిన నేరాలకు న్యాయవ్యవస్థ ద్వారా శిక్షలు తప్పనిసరిగా విధించాల్సిన పరిస్థితి ఉండగా, ఇప్పుడు ఈ నేరస్థులు ప్రభుత్వ ఉద్యోగాలు లభించడంతో పాటు డీఆర్జీ సైన్య దళాల్లో చేరడం ప్రజల్లో తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. మరింతగా, ఈ నియామకాలలో వృత్తిపరంగా తగిన అర్హతలేమి లేకపోవడం కూడా ప్రజలను అసహనానికి గురిచేస్తోంది.

వివరాలు 

స్థానిక గిరిజనుల మధ్య వ్యతిరేకతలు పెరుగుతున్నాయి 

డీఆర్జీ దళాల్లో స్థానిక గిరిజన యువతను మాత్రమే మావోయిస్టు వ్యతిరేక చర్యల కోసం ఎంపిక చేయడం,ఆదివాసీల మధ్య విభేదాలు పెరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు మావోయిస్టుల హస్తంలో ఉండే గిరిజనులు డీఆర్జీలో పనిచేస్తూ ప్రాణాలు కోల్పోగా,మరొకవైపు డీఆర్జీ దళాల చేతుల్లో మావోయిస్టులుగా ఉన్న గిరిజనులు మరణిస్తున్నారు. ఈ కారణంగా గిరిజన గ్రామాల్లో, కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య విభజన మరింత స్పష్టమవుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పోరాటంలో తమనే స్వంత గిరిజనులు బలిపశువులుగా మారిపోతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు 

పారదర్శకత లేకుండా జవాబుదారీతనం లేని ఆపరేషన్లు 

డీఆర్జీ దళాలు చేపడుతున్న మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లపై పారదర్శకత లేకపోవడం, జవాబుదారీతనం లేదనే దృక్పథాలు మానవహక్కుల సంస్థల నుండి వ్యక్తమవుతున్నాయి. ఈ విధమైన ఎన్‌కౌంటర్లపై స్వతంత్ర దర్యాప్తులు జరగకపోవడంతో, డీఆర్జీ దళాలు అటవీ గ్రామాల్లో అనేక రకాల దారుణాలు చేస్తోందంటూ ఆరోపణలు చేయబడుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలన్నింటినీ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మరియు పోలీసు అధికారులు తరచుగా ఖండిస్తూ, ఇవన్నీ మావోయిస్టులవల్ల ప్రేరేపించబడిన ప్రచారాలన్నీని తప్పుతామని వెల్లడిస్తున్నారు.