
Supreme Court: బిహార్ ఓటర్ల జాబితాపై ఈసీ నిర్ణయం రాజ్యాంగబద్ధమైనదే: సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాపై ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) చేపట్టాలని భారత ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈ చర్యను వ్యతిరేకించిన కొన్ని ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే, కోర్టు తీర్పు మాత్రం ఈసీకి అనుకూలంగా వచ్చింది. ఈ చర్య రాజ్యాంగం ప్రకారం జరుగుతోందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఎన్నికల ముందు నిర్వహించడాన్ని మాత్రం ప్రశ్నించింది. బీహార్ రాష్ట్రంలో దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఓటర్ల జాబితా ప్రక్షాళన చేపట్టారు. అప్పటినుంచి కొత్తగా సవరణలు జరగకపోవడంతో, ఇప్పుడైనా దీనిని నిర్వహించాల్సిన అవసరం ఉందని ఎన్నికల సంఘం భావిస్తోంది.
వివరాలు
బీహార్‌ను ఎంచుకోవడంపై.. రాజకీయ పార్టీలు అభ్యంతరం
కానీ, అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ ప్రక్రియను ప్రారంభించడం పలు వర్గాల విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా బీహార్‌ను మొదట ఎంచుకోవడంపై అనేక రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సూచనలతోనే ఎన్నికల సంఘం ఈ చర్య చేపడుతుందని, దీని ద్వారా ముస్లిం, వలస కార్మికులు, దళితులు వంటి వర్గాలను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలనే ఉద్దేశమున్నదని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా బ్లాక్ ఆరోపిస్తోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛంద సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై ఇటీవల కోర్టులో విచారణ జరిగింది.