LOADING...
Prof S Mahendra Dev: ప్రధానికి ఆర్థిక సలహామండలి ఛైర్మన్‌గా సూర్యదేవర మహేంద్రదేవ్‌   
ప్రధానికి ఆర్థిక సలహామండలి ఛైర్మన్‌గా సూర్యదేవర మహేంద్రదేవ్‌

Prof S Mahendra Dev: ప్రధానికి ఆర్థిక సలహామండలి ఛైర్మన్‌గా సూర్యదేవర మహేంద్రదేవ్‌   

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 06, 2025
08:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ ఆర్థిక నిపుణుడు, గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలానికి చెందిన తుమ్మపూడి గ్రామంలో జన్మించిన డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్‌ను ప్రధాని ఆర్థిక సలహా మండలి (EAC-PM)కి అధ్యక్షుడిగా నియమించారు. ఈ విషయాన్ని ఆయన గురువారం మెయిల్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్ డైరెక్టర్‌గా ఉన్న మహేంద్రదేవ్, గతంలో ప్రముఖ సంస్థ అయిన ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్‌కి డైరెక్టర్‌గా (ఉప కులపతి హోదాలో) పనిచేశారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయాన్ని తీసుకునే ముఖ్యమైన బోర్డు అయిన వ్యవసాయ ధరల నిర్ణయక సంఘానికి ఛైర్మన్‌గా సేవలందించారు. కొత్త బాధ్యతలు స్వీకరించిన వెంటనే, ఆయన యాక్సిస్ బ్యాంక్ డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేశారు.

వివరాలు 

ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రచురించే జర్నల్‌లో ఆయన రచనలు

అంతర్జాతీయ స్థాయి చిత్రకారుడు సంజీవ్‌దేవ్ కుమారుడైన మహేంద్రదేవ్ తన పాఠశాల విద్యను చిలువూరు,రేవేంద్రపాడు గ్రామాల్లో పూర్తి చేశారు. తరువాత తెనాలిలో ఇంటర్మీడియట్‌ చదివారు. విజయవాడలోని లయోలా కళాశాలలో బీఏ పూర్తి చేసి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పీజీ డిగ్రీ పొందారు. అనంతరం ఢిల్లీలో పీహెచ్‌డీ చేశారు. ఆయన హైదరాబాద్‌లో ఉన్న సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్‌కు కొంతకాలం డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. వ్యవసాయ అభివృద్ధి, పేదరిక నిర్మూలన, ఆహార భద్రత, ఉపాధి కల్పన వంటి ముఖ్యమైన సామాజిక-ఆర్థిక రంగాల్లో వందకుపైగా పరిశోధన వ్యాసాలు రాశారు. ఆయన రచనలు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రచురించే జర్నల్‌లో కూడా ముద్రించారు.

వివరాలు 

ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా  మహేంద్రదేవ్ 

ప్రపంచబ్యాంక్, యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (UNDP), యునెస్కో, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) వంటి అంతర్జాతీయ సంస్థలకు కూడా ఆయన సలహాదారుగా పనిచేశారు. గత సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన రచించిన "పర్స్పెక్టివ్‌స్ ఆన్ ఈక్విటబుల్ డెవలప్‌మెంట్" అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇంతకుముందే మహేంద్రదేవ్ ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు.