
Mumbai Rain: ముంబైను ముంచెత్తిన కుండపోత వర్షం.. రోడ్లన్నీ జలమయం.. వాహనదారులకు ఇక్కట్లు
ఈ వార్తాకథనం ఏంటి
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మంగళవారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తోంది.
కుండపోతగా పడిన వర్షానికి నగరం మొత్తం నీటితో నిండిపోయింది. గంటలపాటు పడిన వర్షం కారణంగా రహదారులు జలమయం అయ్యాయి.
చెట్లు విరిగిపడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా డ్రైనేజీలు పొంగిపొర్లడంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది.
వాహనదారులు ఈ నీటిలో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంబై, పూణెతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం నుంచి ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు నమోదయ్యాయి.
ఎండ తీవ్రత నుంచి ఊరట లభించినా, వర్షం ఉధృతి కారణంగా జనజీవనం తీవ్రంగా అతలాకుతలమైంది.
వివరాలు
కోస్తా కొంకణ్-గోవా మార్గంలో భారీ రాళ్లు పడ్డ ఘటన
ఆకస్మికంగా వచ్చిన వర్షానికి ముంబైలోని పోవై వంటి ప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి.
ఫలితంగా అక్కడ రాకపోకలు స్థంభించాయి. జల్వాయు కాంప్లెక్స్ సమీపంలో చెట్లు కూలిపోయిన కారణంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక రత్నగిరి జిల్లాలో వెర్వాలి, విలావాడే రైల్వే స్టేషన్ల మధ్య కొండచరియలు విరిగిపడటంతో కొంకణ్ రైల్వే మార్గంలో రైలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
అంతేకాకుండా కోస్తా కొంకణ్-గోవా మార్గంలో భారీ రాళ్లు పడ్డ ఘటన వల్ల మహారాష్ట్ర, గోవా, కర్ణాటకలను కలిపే 741 కిలోమీటర్ల రైలు మార్గం తాత్కాలికంగా నిలిచిపోయింది.
వివరాలు
నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు
ఇదిలా ఉండగా,రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో కర్ణాటక తీరం వెంబడి ఏర్పడిన తుఫాను ప్రభావంతో బుధవారం నుంచి శనివారం మధ్య మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని ముంబై ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మే 22న అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, అది ఉత్తర దిశగా కదిలి మరింత బలపడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
తుఫాను ప్రభావంతో మహారాష్ట్రలో మరింత వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.
కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది.