
Shashi Tharoor: 'ముందు ఏ పార్టీలో ఉన్నావో చెప్పు.. థరూర్‌పై మురళీధరన్ విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ లోక్‌సభ ఎంపీ శశిథరూర్ ఆ పార్టీపై విమర్శలు చేస్తున్న తీరుపై పార్టీ నేతల నుండి తీవ్ర స్పందనలు వస్తున్నాయి. కేరళలోని యూడీఎఫ్ నేతల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనవైపే మొగ్గు ఉందని ఇటీవల సర్వే వెల్లడించిందంటూ ఆయన చేసిన పోస్టుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో,ఆయన వాస్తవంగా ఏ పార్టీలో ఉన్నారో స్పష్టంగా చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు.
వివరాలు
శశిథరూర్-కాంగ్రెస్ నాయకత్వం మధ్య బంధం రోజురోజుకీ మరింత బీటలు
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత కె. మురళీధరన్ స్పందిస్తూ,''ప్రతి సర్వేలో ఎవరో ఒకరు ముందుంటారు.కానీ,2026 అసెంబ్లీ ఎన్నికల అనంతరం యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వస్తే, ఆ కూటమికి చెందిన నాయకుడే ముఖ్యమంత్రి అవుతారు. మా అసలు లక్ష్యం మాత్రం ఎన్నికల్లో విజయం సాధించడమే. అసత్య ప్రచారాలపై,వివాదాలపై మాకు ఆసక్తి లేదు,''అని అన్నారు. శశిథరూర్ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించినప్పుడు మురళీధరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక శశిథరూర్-కాంగ్రెస్ నాయకత్వం మధ్య బంధం రోజురోజుకీ మరింత బీటలు వారుతోంది. ఒకవైపు ఆయన ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ ఇటీవల ఓ కాలమ్ రాయగా,కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందిస్తూ.. "కొంతమందికి మోదీ పట్లే నిబద్ధత ఉన్నట్టుంది" అంటూ సెటైర్లు గుప్పించారు.
వివరాలు
ఎగిరే ముందు ఎవరి అనుమతి అవసరం లేదు
దీనికి ప్రతిస్పందనగా థరూర్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పక్షి చిత్రాన్ని షేర్ చేస్తూ, ''ఎగిరే ముందు ఎవరి అనుమతి అవసరం లేదు. రెక్కలు మనవే. ఆకాశం ఎవరిది కాదు'' అనే సందేశాన్ని పెట్టారు. ఈ పోస్ట్‌పై మరో కాంగ్రెస్ సీనియర్ ఎంపీ మాణికం ఠాగూర్ స్పందిస్తూ, ''ఎగిరేందుకు అనుమతి అవసరం లేదు. పక్షులు రెక్కలు విరుచుకునేందుకు ఎవరి ఆమోదం అక్కర్లేదు. కానీ ఈ రోజుల్లో స్వేచ్ఛగా ఎగిరే పక్షులు కూడా ఆకాశాన్ని శ్రద్ధగా గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే గద్దలు, రాబందులు ఎప్పుడూ వేటలో ఉంటాయి. స్వేచ్ఛ అనేది ఉచితంగా దొరకదు'' అని 'ఎక్స్' వేదికగా వ్యాఖ్యానించారు.