Gaddar Passed Away: ముగబోయిన ఉద్యమ గళం.. గద్దర్ కన్నుమూత
ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ ఆదివారం తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో గద్దర్ కొన్ని రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించడంతో చనిపోయినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. గద్దర్‌కు మావోయిస్టు పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. దాదాపు నాలుగు దేశాబ్దాలు పాటు గద్దర్ మావోయిస్టు పార్టీలో కొనసాగారు. కొంతకాలం క్రితం ఆయన మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి, సొంత రాజకీయ వేదికను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. గద్దర్ అసలు పేరు విఠల్ రావు. ఆయన 1949లో మెదక్ జిల్లాలోలని తుప్రాన్‌లో జన్మించారు. విప్లవోద్యమంలోకి వచ్చాక ఆయన తన పేరును గద్దర్‌గా మార్చుకున్నారు.
అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
గద్దర్ ఉద్యమ ప్రస్థానం
గద్దర్ హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ విద్యను చదివారు. ఇంజనీరింగ్ చదవుతున్న సమయంలో గద్దర్‌కు సామాజిక, సాంస్కృతి అంశాలపై ఆసక్తి పెరిగింది. ఇదే ఆయన్ను విప్లవ రాజకీయాల వైపు మళ్లించింది. సామాజిక అంశాలపై తన పాటల ద్వారా అవగాహన కల్పించేందకు గద్దర్ బర్రకథ ప్రక్రియను ఎంచుకునేవారు. ఈ క్రమంలో భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బుర్రకథ రూపంలో భగత్ సింగ్ జీవితం గద్దర్ చెప్పిన విధానం అందరినీ ఆకట్టుకుంది. ఇది చూసిన దర్శకుడు బి. నర్సింగరావు.. గద్దర్‌తో మా భూమి సినిమాలో యాదగిరి పాత్ర వేయించారు. ఈ సినిమాలో గద్దర్ పాడిన 'బండెనక బండి కట్టి' పాట అప్పట్లో సంచలనం అనే చెప్పాలి.
విప్లవ భావజాల వ్యాప్తికి విశేష కృషి
1972లో జననాట్య మండలిలో గద్దర్ చేరారు. ఈ సంస్థ ద్వారా గ్రామాల్లో జరుగుతున్న అన్యాయాలపై పాడుతూ ప్రజలను చైతన్య పరిచేవారు. ఇదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విప్లవ రాజకీయాలు బలపుడుతున్నాయి. 1975 గద్దర్‌కు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. అటు ఉద్యమాలు, ఇటు ఉద్యోగం చేస్తూ కొంతకాలం గడిపారు. ఆ తర్వాత రాడికల్ స్టూడెంట్ యూనియన్ విప్లవ సంస్థగా రూపాంతరం చెందడం, దానికి అనుబంధంగా ఉన్న జననాట్య మండలిలో గద్దర్ కీలకంగా ఉండటంతో పోలీసుల నిర్భందాలు ఎక్కువగా ఉండేవి. రాడికల్ నాయకులు పీపుల్స్ వార్ పార్టీని ఏర్పాటు చేసి అడవుల్లోకి వెళ్లారు. అనంతరం ఆ విప్లవ సంస్థ భావజాల వ్యాప్తిలో గద్దర్ పోషించిన పాత్ర ఎనలేనిది. తన ఆట,పాటలతో ప్రజలను విప్లవోద్యమం వైపు ఆకర్షించగలిగారు.
1984లో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా
విప్లవ సంస్థలపై ప్రభుత్వాల నిర్భందం పెరిగిన నేపథ్యంలో ఉద్యమం కోసం 1984లో గద్దర్ తన బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తిస్థాయిలో విప్లవోద్యమానికి అంకితం అయ్యారు. ఆ తర్వాత కారంచేడులో జరిగిన దళితుల ఊచకోతపై తన గళాన్ని బలంగా వినిపించారు. ఆ తర్వాత గద్దర్ కొంతకాలం అతజ్ఞాతంలోకి వెళ్లారు. గోచి, దోతి, గొంగలి ధరించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా,బిహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌తో దేశవ్యాప్తంగా విప్లవ భావజాల వ్యాప్తికి తన పాట ద్వారా గద్దర్ ఎనలేని సేవ చేశారు. సామాన్యుల మాట్లాడుకునే పదాలతో ఆయన అల్లే పాటలు పామరులకు సైతం అర్థం అయ్యేవి. అప్పట్లో గద్దర్ మీటింగ్ ఎక్కడ జరిగినా జనం పోటేత్తేవారు. ఆయన పాడిన పాటల క్యాసెట్ విడుదలైతే హాట్ కేకుల్లా అమ్ముడయ్యేవి.
1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై కాల్పులు
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు 1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పులకు పోలీసులే చేశారని, అది కూడా చంద్రబాబు ఆదేశాలతో చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కాల్పులు జరిపిన సమయంలో కొన్ని బుల్లెట్లు గద్దర్ శరీరంలోకి చొచ్చుకెళ్లాయి. అయితే ఆ తర్వాత ఆపరేషన్ చేసిన డాక్టర్లు గద్దర్ శరీరంలోని అన్ని బుల్లెట్లను తొలగించారు. కానీ వెనుముకకు ఆనుకొని ఉన్న బుల్లెట్‌ను మాత్రం అలాగే ఉంచారు. దాన్న తొలగిస్తే ప్రాణానికి ముప్పని అలాగే ఉంచారు. ఈ ఘటన తర్వాత గద్దర్ అడవిలోకి వెళ్లకుండా, మైదానా ప్రాంతాల్లోనే మావోయిస్టు సానుభూతిపరునిగా ఉంటూ వచ్చారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వంతో మావోయిస్టల చర్చల సందర్భంలో కూడా గద్దర్ మధ్యవర్తుల్లో ఒకరిగా ఉన్నారు.
తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చెరగని ముద్ర
తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్రను ఎంత ఎక్కువ చెప్పుకున్నా, తక్కువే అవుతుంది. 1969లో జరిగిన తొలిదశ తెలంగాణ ఉద్యమంలో సైతం గద్దర్ కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత 1997లో భువనగిరిలో జరిగిన తెలంగాణ సభ విజయవంతం కావడంలో గద్దర్ ది కీ రోల్ అని చెప్పాలి. అనంతరం జరిగిన ప్రతి తెలంగాణ వేదికపై గద్దర్ తన గళంతో ప్రజలను చైతన్యం చేశారు. 2001లో టీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత, కేసీఆర్‌తో కొంతకాలం పని చేశారు. తెలంగాణ మలి ఉద్యమం సమయంలో గద్దర్ పాట లేకుండా ధూంధాం కార్యక్రమాలు జరిగేవి కావు. తన జీవితం మొత్తాన్ని విప్లవోద్యమానికి, తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసిన గద్దర్.. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని సంతకమయ్యారు.