LOADING...
Free Bus Travel Scheme: ఏపీలో ఉచిత ప్రయాణం.. 8,458 బస్సులు సిద్ధం.. రద్దీకి తగ్గట్లుగా అధికారుల ఏర్పాట్లు
రద్దీకి తగ్గట్లుగా అధికారుల ఏర్పాట్లు

Free Bus Travel Scheme: ఏపీలో ఉచిత ప్రయాణం.. 8,458 బస్సులు సిద్ధం.. రద్దీకి తగ్గట్లుగా అధికారుల ఏర్పాట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2025
10:28 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఈ నెల 15వ తేదీ నుంచి అమలులోకి రానుంది. ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన మొత్తం బస్సుల్లో సుమారు 74 శాతం వాహనాలు ఈ పథకంలోకి వస్తాయి. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద 11,449 బస్సులు ఉండగా, వాటిలో ఐదు రకాల సేవలలో నడిచే 8,458 బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు కానుంది. ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, రద్దీని నియంత్రించేందుకు అవసరమైన ఏర్పాట్లలో ఆర్టీసీ అధికారులు నిమగ్నమవుతున్నారు.

వివరాలు 

మంగళగిరిలో సీఎం చేతుల మీదుగా పథకం ప్రారంభించే అవకాశం

ప్రభుత్వం వచ్చే రెండు రోజుల్లో ఈ పథకానికి సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేయనుంది. అందులో ఉచిత ప్రయాణం వర్తించే బస్సుల జాబితా, గుర్తింపు కార్డులుగా అంగీకరించే పత్రాల వివరాలు ఉంటాయి. ఆగస్టు 15న మంగళగిరిలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఉదయం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని, అనంతరం మధ్యాహ్నం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అయితే, అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

వివరాలు 

వీటిలో ఉచిత ప్రయాణం ఉండదు.. 

కొన్ని ఎక్స్‌ప్రెస్‌ బస్సులు అంతర్రాష్ట్ర సర్వీసులుగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలోని పలు ప్రాంతాలకు నడుస్తున్నాయి. ఈ వాహనాల్లో ఉచిత ప్రయాణం ఉండదు. అలాగే, అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు మార్గం, నంద్యాల జిల్లాలో శ్రీశైలం ఘాట్‌ రూట్‌లో నడిచే ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులపై కూడా ఈ సౌకర్యం అమలు చేయకూడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కారణం - ఉచిత ప్రయాణం కల్పిస్తే ఈ మార్గాల్లో రద్దీ అధికమై, ఘాట్‌ ప్రాంతాల్లో నడపడం సవాలుగా మారవచ్చు. నాన్‌స్టాప్‌ ఎక్స్‌ప్రెస్‌ బస్సులకూ ఈ పథకం వర్తించదు.

వివరాలు 

డ్రైవర్లు, కండక్టర్ల కొరత తీర్చేలా.. 

డ్రైవర్ల కొరత సమస్యను ఎదుర్కొనేందుకు ప్రతి డిపోలో ఆన్‌కాల్‌ డ్రైవర్ల సంఖ్యను పెంచనున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా ప్రజా రవాణా శాఖ అధికారులు వీరి నియామక ప్రక్రియను ప్రారంభించారు. కొన్ని డిపోలలో కండక్టర్లు తక్కువగా ఉండటం వల్ల, ఇతర విధులు నిర్వహిస్తున్న (ఓడీ) కండక్టర్లను తిరిగి బస్సు సేవల్లోకి పంపించనున్నారు. అంతేకాకుండా, కొన్ని బస్టాండ్లలో టికెట్‌ బుకింగ్‌ కేంద్రాల్లో పనిచేస్తున్న కండక్టర్లను కూడా బస్సు డ్యూటీలకు నియమించనున్నారు. అవసరమైతే కొద్దిరోజుల పాటు కండక్టర్లను డబుల్‌ డ్యూటీలు చేయమని డిపో మేనేజర్లు కోరుతున్నారు.

వివరాలు 

తగ్గనున్న పురుష ప్రయాణికులు 

మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల పురుష ప్రయాణికుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రద్దీ బస్సుల్లో నిల్చుని ప్రయాణించకుండా, ప్రైవేట్‌ వాహనాల్లో ప్రయాణం చేసేందుకు పురుషులు మొగ్గు చూపవచ్చని అంచనా. ప్రస్తుతం బస్సుల్లో ప్రయాణికుల్లో సుమారు 60 శాతం పురుషులు, 40 శాతం మహిళలు ఉన్నారు. ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఐదు రకాల బస్సుల్లో పురుషుల శాతం 33కి తగ్గి, మహిళల శాతం 67కి పెరిగే అవకాశం ఉంది.

వివరాలు 

ఆర్థిక ప్రభావం 

పురుష ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడం వలన ఆర్టీసీకి వార్షికంగా రూ.288 కోట్ల ఆదాయం తగ్గవచ్చని అంచనా. మహిళలకు లభించే ఉచిత ప్రయాణ ఛార్జీల విలువ సంవత్సరానికి రూ.1,453 కోట్లుగా లెక్కించారు. అలాగే, పథకం అమలుతో నిర్వహణ ఖర్చులు అదనంగా రూ.201 కోట్ల వరకు పెరుగుతాయని అంచనా. మొత్తం మీద, ఈ కొత్త పథకం కారణంగా ఆర్టీసీపై నెలకు సుమారు రూ.162 కోట్ల భారంతో, ఏడాదికి రూ.1,942 కోట్ల ఆర్థిక భారం పడనుంది.