Page Loader
Pawan Kalyan:'వ్యాపారానికి హిందీ అవసరమైతే,నేర్చుకోవడంలో ఇబ్బంది ఏంటి?'.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు 
వ్యాపారానికి హిందీ అవసరమైతే,నేర్చుకోవడంలో ఇబ్బంది ఏంటి?'.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

Pawan Kalyan:'వ్యాపారానికి హిందీ అవసరమైతే,నేర్చుకోవడంలో ఇబ్బంది ఏంటి?'.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 11, 2025
04:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి హిందీ భాషపై కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాపారాల్లో ఉపయోగపడేది హిందీయే అయినప్పుడు, దాన్ని నేర్చుకోవడంలో ఎందుకు ఇబ్బంది పడుతున్నాం? అని ఆయన ప్రశ్నించారు. హిందీ మన భాష అని చెప్పడంలో తప్పేముందని ఆయన నిలదీశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన రాజ్య భాష విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, దేశంలో ప్రతి భాష ఒక జీవ భాష, మాతృభాషగా ఉంటుందని, కానీ రాజ్య భాషగా హిందీకి ఉన్న ప్రత్యేకతను ఆయన ప్రస్తావించారు.

వివరాలు 

ప్రతీ భాషా జీవ భాష, మాతృ భాష. కానీ రాజ్య భాష మటుకు హిందీనే

"బెంగాలీ భాషలో రాసిన గీతం దేశ జాతీయ గీతంగా మారింది. పంజాబ్‌కు చెందిన భగత్ సింగ్ స్వాతంత్ర్య సమరయోధుడయ్యాడు. రాజస్థాన్‌కి చెందిన మహారాణా ప్రతాప్ సాహసానికి ప్రతీకగా నిలిచారు. తమిళనాడుకు చెందిన అబ్దుల్ కలాం 'మిస్సైల్ మ్యాన్'గా దేశానికి గౌరవాన్ని తెచ్చారు. మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన వ్యక్తి రూపొందించిన త్రివర్ణ పతాకం దేశ జాతీయ జెండాగా మారింది. ఇలా అన్ని భాషలు జీవభాషలు, మాతృభాషలు కావచ్చు. కానీ దేశ స్థాయిలో అధికార భాషగా నిలిచింది హిందీ మాత్రమే," అని పవన్ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ హిందీపై వ్యతిరేకత అర్థంలేని అంశమని అన్నారు.

వివరాలు 

హిందీతో నష్టం లేదు - పవన్ కళ్యాణ్ 

"ఇంట్లో మాతృభాషలో మాట్లాడతాం. కానీ ఇంటి సరిహద్దులు దాటితే ఇతరులతో సంభాషించాలంటే హిందీ అవసరం. ప్రపంచ దేశాలు విభజన కోసం మార్గాలు వెతుకుతున్నా, మన దేశం ఏకత్వాన్ని కలిగించే సాధనగా హిందీని చూసింది. మన మాతృభాష మన అమ్మ అయితే, హిందీ మన పెద్దమ్మ లాంటిది," అని చెప్పారు. విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యాపారాల్లో భాషా అవరోధాలు కొట్టిపారేస్తున్న ఈ కాలంలో, హిందీని నిరాకరించడం భవిష్యత్ తరాల అభివృద్ధిని అడ్డుకుంటుందని పవన్ హెచ్చరించారు. "హిందీ నేర్చుకోవడం మన భాషను వదిలేసినట్లు కాదు. అది మన సామర్థ్యాన్ని విస్తరించడమే. ఇంకొక భాషను అంగీకరించడం ఓటమి కాదు... అది కలిసి ముందుకు సాగడమే," అని అన్నారు.

వివరాలు 

దక్షిణ భారత సినిమాల్లో 31శాతం చిత్రాలు హిందీలో డబ్ అవుతన్నాయి 

"ఇంగ్లీష్ నేర్చుకున్నద్వారా ఐటీ రంగంలో మనం ఎదగగలిగాం. అలాగే, దేశవ్యాప్తంగా అధిక జనాభా మాట్లాడే హిందీ భాష నేర్చుకోవడం వల్ల మనకు మాత్రమే లాభం జరుగుతుంది కానీ నష్టం ఏమాత్రం ఉండదు. ఉదాహరణకు, దక్షిణ భారత సినిమాల్లో 31శాతం చిత్రాలు హిందీలో డబ్ అయి మంచి ఆదాయం సంపాదిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో వ్యాపారాలకు హిందీ అవసరం. అలాంటి భాషను నేర్చుకోవడంలో ఇబ్బంది ఏంటి?"అని పవన్ నిలదీశారు. 'ఏ మేర జహా' అనే హిందీ పాటను నేను ఒక తెలుగు సినిమాలో పెట్టడానికీ కారణం, అప్పుడే నాకు హిందీపై గౌరవం ఉండేది. మాతృభాష తెలుగయితే, రాజ్య భాష హిందీ కూడా. ఈ విషయాన్ని అర్థమయ్యేలా చెప్పడానికే అలా చేశాను "అని పవన్ కల్యాణ్ వివరించారు.