
Lulu Group: అమరావతి, తిరుపతిలో లులు మాల్స్ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్నం, అమరావతి, తిరుపతిల్లో లులు మాల్స్ ఏర్పాటు చేయడానికి లులు సంస్థ సానుకూలంగా స్పందించింది.
ఈ మేరకు విశాఖలో మాల్ నిర్మాణ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదముద్ర వేసింది.
అమరావతి, తిరుపతిల్లోనూ మాల్స్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థను కోరగా, సంస్థ సానుకూలంగా స్పందించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో వెల్లడించారు.
2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం విశాఖలో లులు మాల్ ఏర్పాటు కోసం కృషి చేసింది.
ప్రభుత్వం సాగరతీరంలో స్థలం కేటాయించింది. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థలాన్ని లాక్కుని, లులు సంస్థను వెళ్లగొట్టింది.
అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంపై నమ్మకంతో లులు మళ్లీ రావడానికి అంగీకరించింది.
Details
అమరావతి పనుల ప్రారంభానికి ప్రధాని ఆహ్వానం
అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి మంత్రివర్గంలో వెల్లడించారు.
ఈ సందర్భంగా ప్రధానిని ఆహ్వానించేందుకు సీఎం మంగళవారం సాయంత్రం దిల్లీ వెళ్లనున్నట్టు తెలిపారు.
ఈ పర్యటనలో ప్రధానితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కలవనున్నారు. రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదల కోసం విజ్ఞప్తి చేయనున్నారు.
Details
పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు
విద్యారంగంపై చర్చ సందర్భంగా ఉపాధ్యాయుల బదిలీలను ఆన్‌లైన్‌లో పారదర్శకంగా నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు.
ఉపాధ్యాయుల పనితీరు ఆధారంగా బదిలీల విధానంపై చర్చ జరిగింది. విద్యాశాఖ మంత్రి లోకేశ్ స్పందిస్తూ, కొన్ని చోట్ల మూడు తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు ఉండటంతో ఇప్పట్లో పనితీరు ఆధారంగా బదిలీలు సాధ్యంకాదని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఒక్కో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించిన తర్వాత ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Details
విద్యార్థుల స్టార్టప్‌లకు ప్రోత్సాహం
స్టార్టప్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యార్థులు ప్రారంభించే స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేయనున్నారు.
ఈ ఫండ్ ద్వారా ఒక్కో స్టార్టప్‌కు రూ.2 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు సాయం అందించనున్నారు.
అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను, ఐదు ప్రాంతీయ కేంద్రాలను హబ్ అండ్ స్పోక్ విధానంలో ఏర్పాటు చేయనున్నారు.
హబ్‌కు ప్రభుత్వం రూ.50 కోట్లు, ప్రైవేటు సంస్థలు రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. స్పోక్‌లకు ఒక్కో కేంద్రానికి ప్రభుత్వం రూ.30 కోట్లు, ప్రైవేటు సంస్థలు రూ.30 కోట్లు వెచ్చించనున్నారు.
Details
తాడిగడపకు వైఎస్సార్ పేరు పెట్టడంపై అభ్యంతరం
వైసీపీ ప్రభుత్వం మున్సిపాలిటీకి వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ అని పేరు పెట్టడంపై మంత్రివర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది.
తాడిగడపకు వైఎస్సార్‌కు సంబంధం లేదని, ప్రాంతాల ప్రాముఖ్యత దెబ్బతినకూడదని చర్చించింది.
కడప జిల్లాకు వైఎస్సార్ పేరు జతచేయడంపై అభ్యంతరం లేదన్నారు.
కానీ కడప అనే చారిత్రక పేరును తొలగించకూడదని నిర్ణయించింది. ఇకపై వైఎస్సార్ కడప జిల్లాగా వ్యవహరించాలని తేల్చిచెప్పింది.
Details
సౌర ఫలకాల తయారీలో స్వయం సమృద్ధి
ఇండోసోల్ సంస్థకు రాష్ట్రంలో సౌర ఫలకాల పరిశ్రమ ఏర్పాటు చేయడానికి మంత్రివర్గం అనుమతి ఇచ్చింది.
భవిష్యత్తులో సౌర విద్యుత్ కేంద్రాల పెరుగుదల కారణంగా సౌర ఫలకాల డిమాండ్ పెరుగుతుందని సీఎం తెలిపారు.
చైనా నుంచి దిగుమతులు నిలిపివేయడంతో స్వయంసమృద్ధి లక్ష్యంగా ఈ పరిశ్రమకు అనుమతినిచ్చామని వివరించారు.