CAA: CAA అమలు వేగవంతం చేసిన కేంద్రం.. మూడు రాష్ట్రాల్ల లబ్ధిదారులకు భారత పౌరసత్వం
పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తరాఖండ్‌లలో పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) కింద కేంద్ర ప్రభుత్వం బుధవారం పౌరసత్వం మంజూరు చేయడం ప్రారంభించింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. మూడు రాష్ట్రాలకు చెందిన దరఖాస్తుదారులకు సంబంధిత రాష్ట్ర సాధికార కమిటీ పౌరసత్వం మంజూరు చేసిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఎంత మందికి పౌరసత్వం లభించిందన్న సమాచారం ఇంకా వెల్లడి కాలేదు. అంతకుముందు మే 15న,CAA కింద తొలిసారిగా 14మందికి భారత పౌరసత్వం లభించింది. కేంద్ర ప్రభుత్వం మార్చి 11న దేశవ్యాప్తంగా CAAని అమలు చేసింది. CAA ప్రకారం,డిసెంబర్ 31, 2014కంటే ముందు పాకిస్థాన్,బంగ్లాదేశ్,ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడానికి ఒక నిబంధన ఉంది.
శరణార్థులకు పౌరసత్వం లభించడం పట్ల షా సంతోషం
పౌరసత్వ సవరణ బిల్లు(CAB)10 డిసెంబర్ 2019న లోక్‌సభ, మరుసటి రోజు రాజ్యసభ ఆమోదించింది. 12 డిసెంబర్ 2019న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం పొందిన తర్వాత CAA చట్టంగా మారింది. మమతా బెనర్జీతో సహా దేశంలోని చాలా మంది ప్రతిపక్ష నాయకులు సీఏఏను నిరంతరం వ్యతిరేకిస్తున్నారు. ఏప్రిల్‌లో, మమత CAAని మానవత్వానికి అవమానంగా, దేశం ప్రాథమిక సూత్రాలకు ముప్పు అని పేర్కొన్నారు. బెంగాల్‌లో సీఏఏ అమలుకు ఎప్పటికీ అనుమతించబోమని ఆమె అన్నారు. తొలిసారిగా 14మందికి భారత పౌరసత్వం లభించినందుకు హోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు చారిత్రాత్మకమైన రోజని ఆయన అన్నారు.ప్రతి శరణార్థికి CAA కింద పౌరసత్వం ఇస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు.