Page Loader
Gyanesh Kumar: కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ నియామకం.. రాష్ట్రపతి ఆమోదం
కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ నియామకం.. రాష్ట్రపతి ఆమోదం

Gyanesh Kumar: కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ నియామకం.. రాష్ట్రపతి ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 18, 2025
08:21 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఎన్నికల సంఘం కొత్త అధినేతగా జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్‌గా వివేక్‌ జోషి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి రెండు గెజిట్‌ నోటిఫికేషన్లు విడదలయ్యాయి. ముందుగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్‌ (ఈసీ) పదవుల కోసం అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. ఈ కమిటీలో ప్రధానితోపాటు కేంద్ర మంత్రి అమిత్‌ షా,లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సభ్యులుగా ఉన్నారు. సీఈసీ, ఈసీ పదవులకు ఎంపికైన అభ్యర్థుల పేర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫార్సు చేయగా, ఆమె ఆమోదం తెలిపారు. అనంతరం అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి. 2023లో తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం నియామక ప్రక్రియ మొదటిసారి నిర్వహించారు.

వివరాలు 

ఇప్పటికే మరో ఎన్నికల కమిషనర్‌గా సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు

ప్రస్తుత సీఈసీ రాజీవ్‌ కుమార్‌ పదవీకాలం మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో, ఎంపిక కమిటీ సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయంలో సమావేశమైంది. సంప్రదాయం ప్రకారం, ఎన్నికల కమిషనర్లలో సీనియర్‌ను సీఈసీగా నియమిస్తారు. ఈ విధానాన్ని కొనసాగిస్తూ, రాజీవ్‌ కుమార్‌ తర్వాత సీనియర్‌ అయిన జ్ఞానేశ్‌ కుమార్‌ను సీఈసీగా ఎంపిక చేసినట్లు సమాచారం. జ్ఞానేశ్‌ సీఈసీ బాధ్యతలు స్వీకరించనున్నందున, ఆయన స్థానంలో వివేక్‌ జోషిని ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు ఇప్పటికే మరో ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారు.

వివరాలు 

ఎవరీ జ్ఞానేశ్‌ కుమార్ ... 

కేరళ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ (61)గత ఏడాది మార్చిలో ఎన్నికల కమిషనర్‌గా (ఈసీ) నియమితులయ్యారు. 2019లో కేంద్ర ప్రభుత్వం అధికరణ 370 రద్దు కోసం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును రూపకల్పన చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అప్పట్లో ఆయన కేంద్ర హోంశాఖలో సంయుక్త కార్యదర్శిగా(కశ్మీర్‌ డివిజన్‌)విధులు నిర్వహించారు. అనంతరం సహకార శాఖ కార్యదర్శిగా పనిచేసి 2024 జనవరిలో పదవీ విరమణ చేశారు.కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగా ఆయన ఎన్నికల కమిషనర్‌గా ఎంపికయ్యారు. జ్ఞానేశ్‌ 2029 జనవరి 26 వరకు సీఈసీగా కొనసాగుతారు.ఈ ఏడాది చివరిలో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు, అలాగే 2025లో తమిళనాడు,పుదుచ్చేరి ఎన్నికలు ఆయన పర్యవేక్షణలోనే నిర్వహిస్తారు.

వివరాలు 

వివేక్‌ జోషి.. 

కొత్త నియామక చట్టాన్ని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ నెల 19న ఈ వ్యవహారంపై విచారణ జరగనుంది. అందుకే, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు కొత్త సీఈసీ నియామకాన్ని వాయిదా వేయాలని త్రిసభ్య కమిటీ సమావేశంలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ సూచించినట్లు సమాచారం. హరియాణా క్యాడర్‌కు చెందిన 1989 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి వివేక్‌ జోషి ప్రస్తుతం హరియాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయనను ఎన్నికల కమిషనర్‌గా నియమించారు.