Page Loader
MPOX: మంకీ పాక్స్ అనుమానితులకు పరీక్షలు.. రాష్ట్రాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అడ్వైజరీ
మంకీ పాక్స్ అనుమానితులకు పరీక్షలు

MPOX: మంకీ పాక్స్ అనుమానితులకు పరీక్షలు.. రాష్ట్రాలకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అడ్వైజరీ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2024
03:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో మొట్టమొదటిసారిగా మంకీపాక్స్‌ (mpox) అనుమానితుడిని గుర్తించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ముఖ్యమైన అడ్వైజరీని విడుదల చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ వ్యాధిని ఇప్పటికే పబ్లిక్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఈ తాజా హెల్త్‌ అడ్వైజరీ ప్రకారం, భారత్‌లో ఇప్పటి వరకు ఒక్క మంకీపాక్స్‌ కేసు కూడా నిర్ధారణ కాలేదని పేర్కొంది. కానీ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఆరోగ్యమంత్రిత్వ శాఖ సూచించిన వ్యూహాలను అమలు చేయాలని సూచించారు.

వివరాలు 

క్లస్టర్లను గుర్తించేందుకు నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌

దేశంలో మంకీపాక్స్‌ క్లస్టర్లను గుర్తించేందుకు నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రామ్‌ పనిచేస్తోందని అధికారులు వెల్లడించారు. ఎయిర్‌పోర్టులలో మంకీపాక్స్‌ స్క్రీనింగ్‌ను మరింత వేగవంతం చేసినట్లు చెప్పారు. అనుమానిత కేసులను పరీక్షించేందుకు ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలోని పరిశోధనశాలల నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నట్లు హెల్త్‌ మినిస్ట్రీ తెలియజేసింది. రాష్ట్రాలు చర్మ వ్యాధులు, లైంగిక సంబంధిత వ్యాధుల చికిత్స క్లినిక్స్‌పై దృష్టి పెట్టాలని సూచించింది. వ్యాధి లక్షణాలు ఉన్నవారిని సరిగ్గా పర్యవేక్షించాలని సూచించింది. వ్యాధి వ్యాప్తి, తగిన అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. అలాగే ప్రజల్లో అనవసర భయాలు పుట్టకుండా చూసుకోవాలని హెచ్చరించింది.

వివరాలు 

మంకీపాక్స్‌ వ్యాధికి రెండు వేరియంట్లు

1958లో మొదటిసారిగా గుర్తించిన ఈ వ్యాధి 1970లో మనిషికి సోకింది. ప్రధానంగా ఉష్ణమండల ఆఫ్రికా దేశాల్లోని గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపించేది. దీని పై శాస్త్రవేత్తలు,ఆరోగ్య సంస్థలు కొంత నిర్లక్ష్యం చేశాయి. అయితే, 2022లో ఈ వ్యాధి భారీ స్థాయిలో వ్యాపించడంతో ప్రపంచ దేశాలు పరిశోధనలకు మరిన్ని నిధులు కేటాయించాయి. మంకీపాక్స్‌ వ్యాధికి రెండు వేరియంట్లు ఉన్నాయి - క్లాడ్‌-1 (కాంగోబేసిన్‌ క్లాడ్‌),క్లాడ్‌-2 (పశ్చిమ ఆఫ్రికా క్లాడ్‌). ప్రస్తుతం క్లాడ్‌-1 ఐబీ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోంది, ముఖ్యంగా లైంగిక సంబంధాల కారణంగా ఈ వేరియంట్‌ విస్తరిస్తున్నది.