
Kancha Gachibowli Land Case: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు..నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన కంచ గచ్చిబౌలి భూముల అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి నిరాశ ఎదురైంది.
ఈ కేసుకు సంబంధించి కేంద్ర సాధికార కమిటీ (CEC) సమర్పించిన నివేదికకు స్పందనగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నాలుగు వారాల గడువు ఇచ్చింది.
ఇదివరకే ఈ భూములు ప్రభుత్వానికి చెందినవేనని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎటువంటి సంబంధం లేదని ప్రభుత్వం తన కౌంటర్‌లో పేర్కొంది.
ఈ భూముల వ్యవహారంపై నిన్నమళ్లీ విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ప్రస్తుత స్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ మే 15న జరగనుందని పేర్కొంది.
వివరాలు
తీవ్రంగా స్పందించిన జస్టిస్ బీఆర్ గవాయ్
ఈ వ్యవహారంపై విచారణ జరుగుతున్న సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్ తీవ్రంగా స్పందించారు.
ప్రభుత్వ చర్యలను సమర్థించేందుకు కేవలం వివరణ ఇవ్వడానికంటే, పునరుద్ధరణకు తగిన ప్రణాళిక రూపొందించడం మేలు అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది.
సరైన, సమంజసమైన ప్రణాళికను సమర్పించడంలో విఫలమైతే.. ప్రభుత్వ అధికారులు తాత్కాలికంగా జైలుకు వెళ్లాల్సి రావచ్చని హెచ్చరించింది.
సుమారు 100 ఎకరాల భూమిలో చెట్లను బుల్డోజర్లతో తొలగించినందున, ఇది తీవ్రమైన సమస్యగా భావిస్తున్నట్టు కోర్టు పేర్కొంది.
వివరాలు
రాష్ట్రంలో వాల్టా చట్టం అమల్లో ఉంది
చెట్ల తొలగింపుపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కోర్టు హెచ్చరించింది.
1996లో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం చెట్లను తొలగించే ముందు అనుమతి తీసుకున్నారా లేదా అని జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు.
దీనికి స్పందనగా రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ.. అవసరమైన అనుమతులు తీసుకున్నాకే జామాయిల్ చెట్లు,పొదలు, ఇతర వృక్షాలను తొలగించామని వివరణ ఇచ్చారు.
రాష్ట్రంలో వాల్టా చట్టం అమల్లో ఉందని,దానికి అనుగుణంగానే చర్యలు తీసుకున్నామని అమికస్ క్యూరీ తెలియజేశారు.
కానీ అనుమతులేకుండా చెట్లు తొలగించినట్లయితే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సహా కొందరు ఉన్నతాధికారులు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతుందని గవాయ్ ఆందోళన వ్యక్తం చేశారు.
సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించినపుడు శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
మే 15న తదుపరి విచారణ
అదేవిధంగా, ఈ భూములను రూ.10 వేల కోట్ల విలువైన మార్టిగేజ్‌కు ఉంచినట్లు కేంద్ర సాధికార కమిటీ తన నివేదికలో పేర్కొన్న విషయాన్ని అమికస్ క్యూరీ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
అయితే, ప్రభుత్వం ఆ భూములను అమ్ముతున్నదా, లేక ఉధారంగా పెట్టిందా అన్నది తమ పరిధిలోకి వచ్చే విషయం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది.
అసలు చర్చించాల్సిన అంశం.. ఆ వందల ఎకరాల భూమిలో చెట్లను తొలగించే ముందు ప్రభుత్వం పర్మిషన్ తీసుకుందా లేదా అన్నదేనని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు.
ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం, ప్రస్తుత స్థితిని కొనసాగిస్తూ మే 15న తదుపరి విచారణ జరగనుందని కోర్టు స్పష్టం చేసింది.
అంతవరకూ ఆ భూముల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా ఆదేశించింది.
వివరాలు
పిటిషన్‌లపై సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలి: సుప్రీం
ఇక కంచ గచ్చిబౌలికి సంబంధించిన 400 ఎకరాల భూములపై ఇటీవలే సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం.. ఆ భూములు అటవీ భూములా? అందులో జంతువులు నివసిస్తున్నాయా? అనే అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఈ పిటిషన్‌లపై సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు, తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ 400 ఎకరాల భూముల్లో ఎలాంటి చర్యలు చేపట్టరాదని తేల్చిచెప్పింది.