Page Loader
Himanta Sarma: మహమ్మద్ యూనస్ వ్యాఖ్యలపై దుమారం.. ఖండించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ 
మహమ్మద్ యూనస్ వ్యాఖ్యలపై దుమారం.. ఖండించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ

Himanta Sarma: మహమ్మద్ యూనస్ వ్యాఖ్యలపై దుమారం.. ఖండించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2025
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనా పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితమైన భారత ఈశాన్య రాష్ట్రాలకు సముద్రానికి చేరుకోవడానికి మార్గం లేదని, ఆ ప్రాంతానికి తాము రక్షకులమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆయన వ్యాఖ్యలను భారత నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఈ వ్యాఖ్యలను "ప్రమాదకరమైనవి" అని మండిపడగా, కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలు నేపధ్యంలో ఈశాన్య రాష్ట్రాల పరంగా కేంద్ర విదేశాంగ ఏవిధంగా ఉండనుందని కాంగ్రెస్ ప్రశ్నించింది.

వివరాలు 

పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి భూభాగంలో చికెన్స్ నెక్‌ కారిడార్‌

''యూనస్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమైనవి. అవి పూర్తిగా ఖండించదగినవి.భారత వ్యూహాత్మక కారిడార్,చికెన్స్ నెక్‌ కారిడార్‌ (Chicken's Neck Corridor)తో ముడిపడి ఉన్న అంశాలే ఆయన వ్యాఖ్యలకు కారణం. ఈ కారిడార్ పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి భూభాగంలో ఉంది.ఈశాన్య రాష్ట్రాలను భారత ప్రధాన భూభాగంతో ఈ కారిడార్ కలుపుతోంది. చుట్టూ నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌ విస్తరించి ఉన్నాయి. గతంలోనూ, భారత ప్రధానం,ఈశాన్య ప్రాంతాన్ని విడదీసే ప్రయత్నాలు స్వదేశంలోనే వ్యతిరేక శక్తులు చేశాయి.

వివరాలు 

యూనస్ చేసిన రెచ్చగొట్టే ప్రకటనలను తేలిగ్గా తీసుకోవద్దు

అందుకే, ఈ కారిడార్ చుట్టూ సమర్థవంతమైన రైల్వే, రోడ్డు నెట్‌వర్క్‌ అభివృద్ధి చేయడం అత్యంత అవసరం. ఇంకా, చికెన్స్ నెక్‌ను బైపాస్ చేసేలా రెండు భూభాగాలను అనుసంధానించే ప్రత్యామ్నాయ మార్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ, దీని కోసం ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. అయితే, సంకల్పం,ఆవిష్కరణలతో ఆ దిశగా విజయాన్ని సాధించవచ్చు. యూనస్ చేసిన రెచ్చగొట్టే ప్రకటనలను తేలిగ్గా తీసుకోవద్దు. అవి వారి దీర్ఘకాలిక వ్యూహాలను ప్రతిబింబిస్తున్నాయి'' అని హిమంత బిశ్వ శర్మ అన్నారు.

వివరాలు 

పవన్ ఖేడా కూడా ఆందోళన

ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేడా కూడా ఆందోళన వ్యక్తంచేశారు. ''బంగ్లాదేశ్‌ అనుసరిస్తోన్న విధానం మన ఈశాన్య ప్రాంతానికి తీవ్రమైన ముప్పుగా కనిపిస్తోంది.మన ప్రభుత్వం మణిపూర్‌ను పట్టించుకోవడం లేదు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో చైనా ఒక గ్రామాన్ని నిర్మించింది. తమ దేశం(బంగ్లాదేశ్‌)నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మనలను చుట్టుముట్టాలని బంగ్లా ప్రయత్నిస్తోంది.అలాంటి పరిస్థితుల్లో మన విదేశాంగ విధానం దయనీయంగా కనిపిస్తోంది'' అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బంగ్లాలో హైకమిషనర్‌గా పనిచేసిన వీణా సిక్రీ యూనస్ వ్యాఖ్యలను ఖండించారు. ''ఇవి దిగ్భ్రాంతికరమైనవి.ఈ విధంగా మాట్లాడటానికి యూనస్‌కు ఏమాత్రం హక్కు లేదు.ఈశాన్య ప్రాంతం భారతదేశంలో భాగమని ఆయనకు తెలుసు.ఈశాన్యభారతం ద్వారా బంగాళాఖాతంలోకి ప్రవేశించడంపై బంగ్లాతో అధికారిక ఒప్పందాలు ఉన్నాయి''అని ఆమె స్పష్టంచేశారు.

వివరాలు 

డోక్లాం ప్రాంతం తమదేనన్న చైనా

పశ్చిమ బెంగాల్‌లోని ఈ ప్రాంతంలో కొంతభాగం కేవలం 22 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంది. ఇది నేపాల్,భూటాన్,బంగ్లాదేశ్‌లకు దగ్గరగా ఉంది.చైనాకు చెందిన చుంబీ లోయ దీనికి అత్యంత సమీపంలో ఉంది. ఈ ప్రాంతంపై దాడి చేసి భారత్ నుండి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసే ప్రమాదం ఉందని సైనిక వ్యూహకర్తలు గత కొన్ని దశాబ్దాలుగా ఆందోళన చెందుతున్నారు. ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి. డోక్లాం ట్రై జంక్షన్‌ వద్ద చైనా రోడ్డు నిర్మాణాలను భారత్‌ అడ్డుకోవడానికి గల ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటి. డోక్లాం ప్రాంతం తమదేనని చైనా వాదిస్తోంది. ఈ విషయమై 2017లో భారత్-చైనా మధ్య 72 రోజుల పాటు ప్రతిష్టంభన నెలకొంది.