Page Loader
HMPV Virus: బెంగళూరులో హెచ్‌ఎంపీవీ కేసు.. సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన
బెంగళూరులో హెచ్‌ఎంపీవీ కేసు.. సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన

HMPV Virus: బెంగళూరులో హెచ్‌ఎంపీవీ కేసు.. సీఎం సిద్ధరామయ్య కీలక ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2025
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులో 3 నెలలు, 8 నెలల వయస్సున్న చిన్నారుల్లో హెచ్‌ఎంపీవీ వైరస్ పాజిటివ్‌గా తేలడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో మొత్తం మూడు కేసులు బయటపడినట్లు ఐసీఎంఆర్‌ ధ్రువీకరించడంతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇద్దరు చిన్నారులకు వైరస్ సోకినట్లు తెలిసిన వెంటనే ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావుతో తాను సంప్రదించానని, ఆయన వెంటనే ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారన్నారు. పరిస్థితిని నియంత్రించేందుకు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వం దానిని అమలు చేస్తుందన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తామని తెలిపారు. బెంగళూరులో హెచ్‌ఎంపీవీ కేసులు నమోదు కావడంపై ఆరోగ్యశాఖ మంత్రి దినేశ్ గుండూరావు మాట్లాడారు.

Details

పీసీఆర్‌ పరీక్షలు అవసరం

ఈ వైరస్ కొత్తది కాదని స్పష్టం చేశారు. చైనాలో ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను కర్ణాటక ప్రభుత్వం దగ్గరగా గమనిస్తోందని తెలిపారు. హెచ్‌ఎంపీవీ వల్ల సాధారణంగా జలుబు, ఫ్లూ, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. ఇటీవల నమోదైన కేసులను తొలి కేసులుగా ప్రస్తావించడం తప్పుదోవ పట్టించే విషయమని మంత్రి పేర్కొన్నారు. ఈ వైరస్ పిల్లలు, వృద్ధుల్లో ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని తెలిపారు. మన దేశంలో గుర్తించిన కేసులు స్థానిక స్ట్రెయిన్‌కు సంబంధించివేనని, చైనాలో వ్యాప్తి చెందుతున్న స్ట్రెయిన్‌తో వీటికి సంబంధం లేకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ కేసుల నిర్ధారణ కోసం పీసీఆర్‌ పరీక్షలు అవసరమని, అలాగే చైనాలో గుర్తించిన స్ట్రెయిన్‌ను విశ్లేషించాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన పేర్కొన్నారు.

Details

పరిస్థితి చేయి దాటకుండా చూడాలి : కేజ్రీవాల్

చైనాలో కలకలం రేపిన హెచ్‌ఎంపీవీ వైరస్ భారతదేశంలో వ్యాప్తిపై ఆప్ జాతీయ కన్వీనర్, దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కోవిడ్ సమయంలో సాధించిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని, కేంద్రం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పరిస్థితి చేయిదాటిపోకుండా మరింత కఠినమైన చర్యలు తీసుకోవడం, మరో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని నివారించడం ముఖ్యమని కేజ్రీవాల్ గుర్తు చేశారు.