LOADING...
Mission Sudarshan Chakra: భారత రక్షణ వ్యవస్థను మార్చబోయే 'మిషన్ సుదర్శన చక్ర'.. దేశ భద్రతకు స్వదేశీ రక్షణ కవచం
దేశ భద్రతకు స్వదేశీ రక్షణ కవచం

Mission Sudarshan Chakra: భారత రక్షణ వ్యవస్థను మార్చబోయే 'మిషన్ సుదర్శన చక్ర'.. దేశ భద్రతకు స్వదేశీ రక్షణ కవచం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 25, 2025
02:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశ భద్రత కోసం భారీ ప్రణాళికను ప్రకటించారు. "ప్రతి భారతీయుడు తనను రక్షితుడిగా భావించాలి" అని ఆయన హైలైట్ చేస్తూ, 'మిషన్ సుదర్శన చక్రం' అనే కొత్త రక్షణ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. వచ్చే 10 ఏళ్లలో పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేయబోయే ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలోని కీలక సదుపాయాలకు భద్రత కల్పించబడనుంది.

వివరాలు 

స్వదేశీ సాంకేతికతపై ఆధారపడే ప్రణాళిక 

ఈ మిషన్ మొత్తం రీసెర్చ్ ఆధారంగా, స్వదేశీ సాంకేతికతతోనే తయారు చేయబడుతుందని మోదీ చెప్పారు. ఇది పలు స్థాయిల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆధునిక నిఘా వ్యవస్థలు, సైబర్ రక్షణ, భౌతిక మౌలిక సదుపాయాలకు రక్షణ వంటి అంశాలు ఇందులో భాగమవుతాయి. శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం స్ఫూర్తిగా తీసుకున్నామని, 2035 నాటికి ఈ రక్షణ వ్యవస్థను విస్తరించి మరింత బలపరచాలని ప్రధాని స్పష్టం చేశారు.

వివరాలు 

అంతర్జాతీయ రక్షణ వ్యవస్థల అనుభవం 

ప్రస్తుతం ప్రపంచంలో ఇజ్రాయెల్‌ "ఐరన్ డోమ్", అమెరికా ప్రతిపాదించిన "గోల్డెన్ డోమ్", రష్యా S-400, చైనా HQ-9 వంటి వాయు రక్షణ వ్యవస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ 2011 నుండి వేల రాకెట్లను అడ్డుకుంది. అమెరికా "గోల్డెన్ డోమ్" ప్రణాళిక భూమి, సముద్రం, అంతరిక్షం నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడానికి $175 బిలియన్ ఖర్చుతో రూపొందించబడుతోంది. రష్యా, చైనా ఇప్పటికే ఆధునిక మిసైల్ రక్షణ వ్యవస్థలను వినియోగిస్తున్నాయి.

వివరాలు 

భారత రక్షణ వ్యవస్థలో కొత్త మార్పు 

భారత్‌లో ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ (IACCS) ఉంది. ఇది సైన్యం, వాయుసేన, నౌకాదళ రక్షణ వ్యవస్థలను ఏకం చేసి రియల్ టైమ్‌లో ముప్పులను గుర్తించి అడ్డుకునే సామర్థ్యం కలిగి ఉంది. ఇప్పుడు సుదర్శన చక్ర దీని తోడ్పాటుతో మరింత బలపడనుంది. ఇందులో అకాశ్‌తీర్ నెట్‌వర్క్, ఆధునిక రాడార్లు, డ్రోన్లు, కృత్రిమ మేధస్సు (AI), లేజర్ ఆయుధాలు ఉంటాయి.

వివరాలు 

భవిష్యత్‌కు తగిన రక్షణ 

సుదర్శన చక్రం కేవలం రక్షణ వ్యవస్థ మాత్రమే కాకుండా ప్రెసిషన్ కౌంటర్ స్ట్రైక్స్ చేయగల సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది. ఇది భూమి, సముద్రం, గగనం అంతటా ముప్పులను అడ్డుకోవడంతో పాటు సైబర్ దాడులను కూడా ఎదుర్కొంటుంది. సెన్సార్ గ్రిడ్, హైపర్సోనిక్ వాహనాల గుర్తింపు వంటి ఆధునిక ఫీచర్లు ఇందులో ఉంటాయి. ఆత్మనిర్భర్ భారత్ దిశగా పెద్ద అడుగు "ఆపరేషన్ సిందూర్" సమయంలో పాకిస్తాన్ చేసిన దాడులను భారత్ విజయవంతంగా తిప్పికొట్టిన విషయం తెలిసిందే. అదే అనుభవంతో ఈ మిషన్ రూపుదిద్దుకుంటోంది. పూర్తిగా 'మేక్ ఇన్ ఇండియా' ఆత్మనిర్భర్ భావనలో అభివృద్ధి చేయబడే ఈ ప్రాజెక్టులో రక్షణ పరిశోధనా సంస్థలు, సైన్యం, ప్రైవేట్ రంగం కలిసి పనిచేయనున్నాయి.

వివరాలు 

భారత్‌కు బలమైన రక్షణ కవచం

మిషన్ సుదర్శన చక్ర రాబోయే సంవత్సరాల్లో భారత్‌కు బలమైన రక్షణ కవచంలా నిలవనుంది. ప్రపంచ స్థాయిలో ఉన్న ఐరన్ డోమ్, గోల్డెన్ డోమ్లతో సమానంగా, అంతకంటే ఆధునికంగా తయారవుతుంది. ఇది మన దేశాన్ని గగనం, భూమి, సముద్రం, సైబర్ అన్ని రంగాల్లో రక్షించే శక్తివంతమైన కవచంగా మారనుంది.