
Nitin Gadkari:'ఢిల్లీలో ఉండలేను..ఎప్పుడెప్పుడు వెళ్దామా అనిపిస్తుంది':నితిన్ గడ్కరీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో అత్యంత అధిక వాయు కాలుష్యం కలిగిన నగరాల జాబితాలో జాతీయ రాజధాని దిల్లీ మొదటి స్థానంలో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రతీ ఏడాది అక్కడి కాలుష్య స్థాయిలు ప్రమాదకర స్థాయిలో ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రహదారులు, రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో తాను రెండు నుంచి మూడు రోజులకంటే ఎక్కువ ఉండలేకపోతానని, అక్కడికి వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడు తిరిగి వెళ్ళిపోదామా అనిపిస్తుంటుందని వ్యాఖ్యానించారు.
వివరాలు
'ఏక్ పెడ్ మా కే నామ్ 2.0' కార్యక్రమంలో గడ్కరీ
'ఏక్ పెడ్ మా కే నామ్ 2.0' అనే మొక్కల నాటే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గడ్కరీ మాట్లాడారు. "నేను ఢిల్లీలో అత్యధికంగా రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఉండగలను. అంతకంటే ఎక్కువ గడిపే ధైర్యం నాకు లేదు. ఢిల్లీలో అడుగుపెడితే వెంటనే తిరిగి వెళ్లిపోవాలనే ఆలోచన మదిలో మెదులుతుంటుంది. అందుకే ముందే రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకుంటాను. ప్రజలు దీన్ని తేలికగా తీసుకోవద్దు. ఢిల్లీలో ఉన్న కాలుష్యం ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. వారి ఆయుర్దాయం తగ్గుతోంది. దీనికి ప్రధాన కారణం శిలాజ ఇంధనాలను ఉపయోగిస్తున్న వాహనాలే. ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి," అని ఆయన హితవు పలికారు.
వివరాలు
కాలుష్య నియంత్రణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది
ఇక మార్చిలో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (CSE) విడుదల చేసిన నివేదిక ప్రకారం,ఢిల్లీ మళ్లీ దేశంలో అత్యధికంగా కాలుష్యంతో బాధపడుతున్న నగరంగా గుర్తించబడింది. 2024-25 శీతాకాలంలో (అక్టోబర్ నుండి జనవరి 31 వరకు) ఢిల్లీలో సగటు పీఎం 2.5 స్థాయి 715 మైక్రోగ్రాములు పర్ క్యూబిక్ మీటర్‌గా నమోదైంది. ఇది ఇతర మెట్రోపాలిటన్ నగరాలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితులపై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, కాలుష్య నియంత్రణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా వాహనాల ద్వారా ఏర్పడుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు ముందుగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని, ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అంటున్నారు.
వివరాలు
చెత్త దహనం ఢిల్లీలో కాలుష్యాన్ని మరింత పెంచుతోంది
పర్యావరణానికి మేలు చేసే పరిశ్రమలను ప్రోత్సహించాలని, ఫ్యాక్టరీల నుండి వెలువడే పొగపై కఠిన నియంత్రణలు అవసరమని సూచిస్తున్నారు. అంతేకాదు, చెత్తను కాల్చడం వంటి చర్యలపై నిషేధం విధించాలని, మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరిగే చెత్త దహనం ఢిల్లీలో కాలుష్యాన్ని మరింత పెంచుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల మొక్కలను నాటడం.. నగరాల్లో పచ్చదనం పెంపుపై దృష్టి సారించడం అవసరమని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు.