
Jai shankar: 'పర్యాటకాన్ని దెబ్బతీయడానికే పహల్గామ్ దాడి'.. విదేశాంగ మంత్రి జైశంకర్ హాట్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి అంశంపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్రంగా స్పందించారు. కాశ్మీర్‌లో పర్యాటక రంగాన్ని విధ్వంసం చేయాలనే ఉద్దేశంతో ఈ దాడి జరగిందని పేర్కొన్నారు. ఇది సాధారణ ఉగ్రవాద చర్య కాదని,భారత్‌పై ఆర్థిక యుద్ధంగా పరిగణించాల్సిన చర్యగా అభివర్ణించారు. జైశంకర్ అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ సమీపంలో గల న్యూస్‌వీక్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఓ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్నీన్యూస్‌వీక్ సీఈఓ దేవ్ ప్రగద్ హోస్ట్ చేశారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ...పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు సవాళ్లు విసురుతున్నప్పటకీ, అణు బెదిరింపులకు తాము భయపడేది లేదని అన్నారు. అక్కడి నుంచి చర్యకు కచ్చితంగా ప్రతి చర్య ధీటుగా ఉంటుందని స్పష్టం చేశారు.
వివరాలు
పాకిస్తాన్ నుంచి అనేక ఉగ్రదాడులు
ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపిందని గుర్తు చేశారు. గతంలోనూ పాకిస్తాన్ నుంచి అనేక ఉగ్రదాడులు భారత్ ఎదుర్కొంది అని గుర్తుచేశారు. పహల్గాం ఘటన విషయంలో ఉగ్రవాదులు కాశ్మీర్‌లో అత్యంత కీలకమైన ఆర్థిక రంగమైన పర్యాటకాన్ని లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. ఇది కేవలం ఆర్థిక దెబ్బ మాత్రమే కాకుండా, మత కలహాలకు ఆజ్యం పోసేలా చేసే కుట్రగా కూడా ఇది రూపుదిద్దుకున్నదని వ్యాఖ్యానించారు. ఈ దాడిలో బాధితులెవరో తెలుసుకుని, ప్రత్యేకంగా టార్గెట్ చేసి హత్య చేసిన ఉగ్రవాదుల క్రూరత్వాన్ని ఆయన ఎత్తిచూపారు. ఇలాంటి ఘోరమైన చర్యలు చేసిన వారిని శిక్షించకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిని తప్పకుండా శిక్షించాలని జైశంకర్ గట్టిగా తెలిపారు.