Where Is Kumkis: ఏపీలో ఏనుగుల దాడులు.. కర్ణాటకతో ఒప్పందం చేసుకున్నకుంకీ ఏనుగులు ఎక్కడ?
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల దాడులను నియంత్రించేందుకు కర్ణాటక నుంచి శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను తీసుకురావాలని ఒప్పందం కుదిరి ఐదు నెలలు గడిచినా ఆ ఏనుగుల రాక మాత్రం ఇంకా జరగలేదు.
గత సంవత్సరం ఆగస్టు 8న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా బెంగళూరుకు వెళ్లి కుంకీ ఏనుగుల అవసరాన్ని వివరించేందుకు సీఎం సిద్ధరామయ్యను కలిశారు.
అనంతరం, సెప్టెంబర్ 27న విజయవాడలో కర్ణాటక అటవీ శాఖతో అధికారిక ఒప్పందం కుదిరింది.
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సిబ్బందిని కూడా ఈ ఏనుగులతో శిక్షణ ఇప్పిస్తున్నట్టు ప్రచారం జరిగినప్పటికీ, ఇప్పటికీ కుంకీ ఏనుగుల ఆచూకీ కనిపించటం లేదు.
వివరాలు
అటవీ శాఖ నిబంధనలు ఈ తరలింపుకు ప్రధాన అవరోధం
ఈ ఒప్పందంలో భాగంగా, కర్ణాటక నుంచి 8 కుంకీ ఏనుగులను ఏపీకి పంపేందుకు నిర్ణయం తీసుకున్నారు.
కుంకీల రాకతో చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఏనుగుల దాడులకు అడ్డుకట్ట పడుతుందని అటవీ శాఖ భావించింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చొరవ తీసుకోవడంతో ఏనుగుల రాక త్వరలోనే జరుగుతుందని ఆశించారు.
అయితే అటవీ శాఖ నిబంధనలు ఈ తరలింపుకు ప్రధాన అవరోధంగా మారాయి. వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన నిబంధనల వల్ల ఈ జాప్యం ఏర్పడినట్లు తెలుస్తోంది.
వివరాలు
కుంకీలు ఎందుకు…
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కడప జిల్లాలకు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక అటవీ ప్రాంతాలు సరిహద్దుగా ఉండటంతో అక్కడి నుంచి ఏనుగులు తరచుగా గ్రామాలపై దాడులు చేస్తున్నాయి.
అలాగే, ఉత్తరాంధ్రలో ఒడిశా అటవీ ప్రాంతం నుంచి వచ్చే ఏనుగులు ప్రజలపై విపరీతమైన ప్రభావం చూపుతున్నాయి.
గ్రామాల్లోని పంట పొలాలు, నివాస ప్రాంతాలు ఈ దాడుల బారిన పడుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఏనుగులను తరిమేందుకు గ్రామస్తులు శబ్దాలు చేసీ, ఎత్తుగడలు వేసీ విఫలమవుతున్నారు.
ఏనుగుల గుంపులు కలిసికట్టుగా దాడి చేసినప్పుడు భారీ నష్టం సంభవిస్తోంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, చిత్తూరు జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది.
వివరాలు
కుంకీ ఏనుగుల పాత్ర
ఏనుగుల దాడులను నియంత్రించడానికి కుంకీ ఏనుగులు కీలక పాత్ర పోషిస్తాయి.
శిక్షణ పొందిన మావటిల సహాయంతో కుంకీలు మనుషుల నివాస ప్రాంతాల్లోకి వచ్చిన ఏనుగులను వెనక్కి తరిమే పనిని చేస్తాయి.
మగ ఏనుగులు ఒంటరిగా సంచరిస్తూ ప్రమాదకరంగా మారినప్పుడు,వాటిని బంధించి కుంకీలుగా తయారుచేస్తారు.
కుంకీలు ఏనుగుల మందలను అడవుల్లోకి తరిమేందుకు సమర్థంగా ఉంటాయి.
కొన్ని సందర్భాల్లో వీటి సహాయంతో ఏనుగులను ఎదుర్కోవచ్చు కూడా.
ప్రస్తుతం ఏపీలో శిక్షణ పొందిన కుంకీల కొరత ఉంది. ప్రస్తుతం జయంత్, వినాయక్ అనే రెండు కుంకీలు ఉన్నా, అవి వృద్ధాప్యంలోకి చేరాయి.
చిత్తూరు జిల్లా కౌండిన్య అటవీ ప్రాంతంలోని ననియాల సంరక్షణ కేంద్రంలో వీటిని ఉంచారు. వయసు మీద పడటం వల్ల ఇవి ఇకపై తరలింపులకు పనికిరావు.
వివరాలు
తొలి విడతలో నాలుగు కుంకీ ఏనుగులు రానున్నాయా?
ఏపీలో ఏనుగుల దాడి చోటుచేసుకున్న ప్రతిసారి ఇవే ఉపయోగించేవారు.
అయితే వృద్ధాప్యంలో ఉన్న కుంకీలతో ఏనుగుల మందలను ఎదుర్కోవడం సాధ్యం కాకపోవడంతో కొత్త కుంకీల కోసం కర్ణాటకతో ఒప్పందం కుదిరింది.
కర్ణాటకతో చేసుకున్న ఒప్పందం మేరకు ఏపీకి 8 కుంకీ ఏనుగులు రావాల్సి ఉంది.
అయితే, సాంకేతిక కారణాలతో వీటి తరలింపులో ఆలస్యం ఏర్పడిందని అటవీ శాఖ చెబుతోంది.
ప్రస్తుతం, కర్ణాటక అటవీ శాఖ మంత్రితో సంబంధిత ఫైల్ పెండింగ్‌లో ఉంది. కర్ణాటక సీఎం ఆమోదం లభించిన వెంటనే ఈ ప్రక్రియ వేగవంతం అవుతుంది.
వివరాలు
మావటిలకు శిక్షణ
మొదటి విడతగా మార్చిలోగా నాలుగు కుంకీ ఏనుగులను ఏపీకి పంపే అవకాశం ఉంది.
ఈ కుంకీలను నియంత్రించేందుకు మావటిలకు ఇప్పటికే శిక్షణ అందించారు. కొత్త కుంకీలను అదుపులో ఉంచేందుకు కూడా మావటిలను సిద్ధం చేస్తున్నారు.
అంతేకాకుండా, భవిష్యత్తులో ఏపీకి కుంకీల సరఫరా విషయంలో ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా, స్వయంగా శిక్షణ పొందిన కుంకీలను తయారు చేయాలనే ఆలోచనలో డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి పవన్ ఉన్నారు.
దీనికి సంబంధించి అటవీ శాఖ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.