National Turmeric Board : నేడు జాతీయ పసుపు బోర్డు ఆవిష్కరణ.. నిజామాబాద్ నుంచి ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ఇవాళ జాతీయ పసుపు బోర్డు మొదలుకానుంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఈ బోర్డును వర్చువల్ రూపంలో ప్రారంభించనున్నారు.
జిల్లా కేంద్రంలోని ఓ హోటల్‌లో నిర్వహించనున్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి హాజరవుతారు.
నిజామాబాద్ జిల్లా ఇందూరులో ఈ పసుపు బోర్డు ఏర్పాటవుతుంది. ప్రస్తుతం ఉన్న రీజినల్ స్పైసెస్ బోర్డు కార్యాలయంలోనే ఇవాళ్టి నుంచి జాతీయ పసుపు బోర్డు కార్యకలాపాలు యథావిథిగా కొనసాగనున్నాయి.
ఇకపోతే సోమవారం సాయంత్రం దిల్లీలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. పసుపు రైతులకు సంక్రాంతి కానుకగా కేంద్రం శుభవార్తను అందించింది.
Details
ప్రజల తరుపున మోదీకి కృతజ్ఞతలు
మంగళవారం నుంచి నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు కార్యకలాపాలు ప్రారంభమవుతాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు.
పసుపు బోర్డు కేవలం తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశవ్యాప్తంగా సేవలు అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ప్రకారం పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు.
ఈ నిర్ణయానికి రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి అంటేనే రైతుల పండుగ, గ్రామీణ సంస్కృతికి ప్రతీక అని కిషన్‌రెడ్డి అన్నారు.
ఈ ఏడాది తొలిసారి తన నివాసంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, స్పీకర్ ఓంబిర్లా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కవులు, కళాకారులు పాల్గొన్నారని కిషన్‌రెడ్డి తెలిపారు.