LOADING...
India: ప్రతీకార చర్యలు ఉండవు.. ట్రంప్‌ సుంకాలపై భారత్‌..! 
ప్రతీకార చర్యలు ఉండవు.. ట్రంప్‌ సుంకాలపై భారత్‌..!

India: ప్రతీకార చర్యలు ఉండవు.. ట్రంప్‌ సుంకాలపై భారత్‌..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 01, 2025
08:11 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌ మిత్రదేశమని చెప్పుకుంటూనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్‌పై 25శాతం దిగుమతి సుంకాలను విధించడంతో పాటు అదనంగా పెనాల్టీలను కూడా విధించారు. దీనిపై భారత్‌ కఠినంగా స్పందించి ప్రతీకార చర్యలు తీసుకుంటుందన్న ఊహాగానాలను కేంద్ర అధికార వర్గాలు ఖండించాయి. రెండుదేశాల ప్రయోజనాలకు అనుగుణంగా సంభాషణల ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని స్పష్టం చేశాయి. ట్రంప్ విధించిన సుంకాలపై భారత్ ఎటువంటి ప్రతీకార చర్యలు తీసుకోదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. సమస్యను మౌనంగా ఎదుర్కోవడమే మంచిదని భావించిన అధికారులు,చర్చల ద్వారానే పరిష్కారాన్ని సాధిస్తామని చెప్పారు. ట్రంప్‌ విధించిన ఈటారిఫ్‌లు భారత ఆర్థిక వ్యవస్థలోని కీలక రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చని పలువురు ఆర్థిక నిపుణులు హెచ్చరించగా,అధికార వర్గాలు ఆందోళన అవసరం లేదని తేల్చాయి.

వివరాలు 

భారత ఆర్థిక వ్యవస్థ పెద్దగా అభివృద్ధి చెందింది.. ఆందోళన అవసరం లేదు 

అణు పరీక్షల సమయంలో కూడా భారత్‌పై ఇలాంటి ఆంక్షలే వచ్చినట్లు గుర్తు చేస్తూ, అప్పట్లో మన ఆర్థిక వ్యవస్థ చిన్నదై ఉండేదని చెప్పారు. అయితే ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ పెద్దగా అభివృద్ధి చెందిందని, ఆందోళన అవసరం లేదని పేర్కొన్నారు. చర్చలు కొనసాగుతున్నాయని, ఇరు దేశాలకు ప్రయోజనం కలిగే పరిష్కారాలకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ పార్లమెంటులో వెల్లడించారు. దేశ ప్రయోజనాలను, చిన్న పరిశ్రమలను, రైతులను, వ్యాపారులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

వివరాలు 

భారత్‌ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంగా.. 

భారత్‌ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంగా ట్రంప్‌ ఈ దిగుమతి సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత్, రష్యాలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. భారత్‌ రష్యాతో ఏం చేస్తుందన్న దానిని తాము పట్టించుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇద్దరూ వారి మృత ఆర్థిక వ్యవస్థలను దిగజార్చుకోనీయండని, కలిసి మునగనీయండని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. భారత ఆర్థిక వ్యవస్థ పతనమైందని ఆరోపిస్తూ, ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తప్ప మిగతా అందరికీ తెలుస్తుందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.