
COVID-19: ఇండియాను మరోసారి వణికిస్తున్న కరోనా.. రెండు కొత్త వేరియంట్లతో ముప్పు!
ఈ వార్తాకథనం ఏంటి
గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి దేశంలో మళ్లీ విజృంభిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, అలాగే తెలుగు రాష్ట్రాలలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో తాజాగా 43 కొత్త కరోనా కేసులు నమోదవడం అక్కడి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. తాజా గణాంకాల ప్రకారం, మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 200 దాటినట్లు తెలుస్తోంది.
వివరాలు
మహారాష్ట్రలో కరోనా కేసుల పెరుగుదల ఆందోళనకరం
ఆధికారిక సమాచారం ప్రకారం, ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 209గా ఉంది. వీటిలో పూణే జిల్లాలో అత్యధికంగా 35 కేసులు, ముంబైలో ఎనిమిది కేసులు నమోదు అయ్యాయి. మొత్తం మీద ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకు 300 కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ గణాంకాలు తెలియజేశాయి.
వివరాలు
మే నెలలో అత్యధికంగా కేసులు నమోదు
ఈ ఏడాది తొలి మూడునెలలు కరోనా కేసులు చాలా తక్కువగా ఉండగా, మే నెలలో మాత్రం గణనీయంగా కేసులు పెరిగాయి. జనవరి, ఫిబ్రవరిలో ఒక్కొక్క కేసు మాత్రమే నమోదు కాగా, మార్చిలో ఒక్క కేసు కూడా నమోదవ్వలేదు. ఏప్రిల్‌లో నాలుగు కేసులు నమోదు కాగా, మే నెలలో ఒక్కసారిగా 252 కేసులు నమోదవడం గమనార్హం. ఇది ఒక్క మే నెలలోనే అత్యధికంగా నమోదైన గణాంకం కావడం ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్రలో కరోనా మృతులు కూడా నమోదు ఇప్పటివరకు మహారాష్ట్రలో నాలుగు కరోనా మరణాలు సంభవించగా, తాజాగా 21 సంవత్సరాల యువకుడు కోవిడ్ వల్ల మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇది యువతలోనూ వైరస్ ప్రభావం చూపుతోందన్న సూచనగా భావించవచ్చు.
వివరాలు
దేశంలో కేరళ ముందంజలో..
దేశవ్యాప్తంగా చూస్తే, కేరళ రాష్ట్రంలోనే కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. మే నెలలో కేరళలో 278 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే తమిళనాడులోనూ కేసులు పెరుగుతున్నాయి, అక్కడ కూడా పరిస్థితిని నిగ్రహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కర్ణాటకలో మృతి, రెండు కొత్త వేరియంట్లపై అలర్ట్ కర్ణాటకలో బెంగళూరులో ఒక వృద్ధుడు (84) కరోనా వల్ల మృతి చెందడం మరో కీలక పరిణామం. దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో, ఇప్పుడు రెండు కొత్త వేరియంట్లు భారత్‌లో గుర్తించారు. వీటిలో NB 1.8.1, LF.7 అనే సబ్ వేరియంట్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వేరియంట్స్ అండర్ మానిటరింగ్గా పేర్కొంది.
వివరాలు
కొత్త వేరియంట్లు పెరుగుతున్న కేసులకు కారణం
WHO ప్రకారం, చైనాలో, ఆసియా దేశాల్లో కరోనా కేసుల పెరుగుదలకు ఈ కొత్త వేరియంట్లే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. భారత్‌లోనూ ఇవే ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి: నిపుణుల హెచ్చరిక ఈ కరోనా వేవ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలి, సామాజిక దూరం పాటించాలి, అవసరమైతే టీకాలు తీసుకోవాలి అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తద్వారా మనం వ్యక్తిగతంగా కాకుండా సమాజాన్ని కూడా రక్షించగలుగుతాము.
వివరాలు
జార్ఖండ్ వ్యక్తికి పాజిటివ్
ఆదివారం (మే 26) జార్ఖండ్ రాష్ట్రంలో మొట్టమొదటి కోవిడ్-19 కేసు నమోదైంది. ఇటీవల ముంబై నుండి తిరిగి వచ్చిన వ్యక్తికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని సీనియర్ ఆరోగ్య అధికారి ఒకరు తెలిపారు. ఆ వ్యక్తి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని ఆసుపత్రులను హై అలర్ట్‌లో ఉంచారు. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక ఈ నెలలో కొత్త కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి, దేశ రాజధానిలో మూడు సంవత్సరాలలో మొదటిసారిగా కరోనావైరస్ కేసులు (23) నమోదయ్యాయని పిటిఐ నివేదించింది.